శ్రీరామ
జయ హనుమాన్

Hanuman Shiva Rama

ఒకప్పుడు ఈ దేశంలో శైవమతం, వైష్ణవమతాల మధ్య భయంకరమయిన యుద్ధాలు జరిగాయి. ఆ ద్వేషభావాన్ని తొలగించటానికి మహనీయులెందరో యత్నించారు.

శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః, విష్ణో శ్చ హృదయం శివః
‘యధా శివమయో విష్ణుః, ఏవం విష్ణుమయ శ్శివః’ అనే సూక్తిని ఎలుగెత్తి చాటారు. అంటే విష్ణుస్వరూపుడైన  శివుడికీ, శివస్వరూపుడయిన విష్ణువుకూ నమస్కరిస్తున్నాననీ; శివస్వరూపుడయిన విష్ణువూ, విష్ణువు హృదయమే శివుడూ అని; విష్ణువు శివమయుడని, అట్లే శివుడు విష్ణువుతో నిండినవాడని అర్థం. వారిమధ్య భేదం చూడనంత వరకే మనకు మేలని కూడా చెప్పబడింది.

 

[wp_campaign_1]

అయినా నేటికీ కొందరు శివకేశవులమధ్య భేదభావం చూపుతూనే ఉన్నారు. ‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అన్న మహర్షుల మాటలోని భారతీయతాత్విక విశిష్టతను అర్థం చేసికొలేకపోతున్నారు.

కవిబ్రహ్మ తిక్కన సోమయాజి సమాజంలో ఉన్న ఈ శివకేశవభేదభావం చూచి ఖిన్నుడయి, లోకానికి హరిహరనాధతత్వం తెల్పుతూ హరిహరాంకితంగా రచన గావించాడు.

‘శ్రీ యన గౌరి నా బరగుచెల్వకు జిత్తము పల్లవింపభద్రాయిత మూర్తియై హరిహరం బగురూపము దాల్చి విష్ణురూపయ నమశ్శివాయ యని పల్కెడు భక్త జనంబు వైదికధ్యాయిత కిచ్చ మెచ్చుపరతత్వము గొల్పెద నిష్టసిధ్దికిన్’ అనే హరిహర స్తుతితో తన భారతీంద్రీకరణం ఆరంభించాడు. తిక్కన ననుసరించిన సోమనాధుడు, కొరవి గోపరాజు, భైరవరాజు వేంకటనాధుడు మొదలగు కవులు కూడా హరిహరనాధాంకితంగా కావ్యాలు వ్రాసి సమాజంలోని హరిహరభేదభావాన్ని తొలగించటానికి యత్నించారు.

కాని నిజానికి హరిహర అద్వైతభావానికి ఒకేఒక్క ముఖ్య ప్రతీక హనుమంతుడు. పరస్పరం ద్వేషించుకొనే శైవ వైష్ణవ మతాలు రెంటికి ఏకైక అంగీకార్యుడైన దైవం హనుమంతుడు. శ్రీమహావిష్ణువుయొక్క అవతారమైన శ్రీరాముని పరమభక్తాగ్రేసరుడయిన ఆంజనేయుడు దాసభక్తికి ప్రతీక అయిన పరమవైష్ణవ శిఖామణి. ఊర్థ్వపుండ్రాలు ధరించి శ్రీరాముని ముందే కాక వేంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి మొదలగు సకల విష్ణుస్వరూపాల ముందు ప్రతిష్టుతుడవటం చూస్తాం. అటువంటి పరమ వైష్ణవ శిఖామణి నిజానికి ఈశ్వరాంశ సంభూతుడు.

హనుమంతుని పూజానామాలలో ‘ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః’ అనేది కూడా ఒకటి. ఆంజనేయుడు శివస్వరూపుడు. ఈశ్వరుడికి పదకొండు రూపాలున్నాయి. వాటినే ఏకాదశరుద్రులంటారు. అందులో అజైకపాద రుద్రావతరమే హనుమంతుడు. పంచముఖాంజనేయావతారం పూర్ణరుద్రావతరమే.

పంచముఖాంజనేయ ధ్యానం
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జై రసి ఖేట పుస్తక సుధాకుంభాంకుశాద్రీన్ హలం ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారిగర్వాపహమ్

పంచముఖాంజనేయుడు పంచముఖ పరమేశ్వరుని వలెనే ఐదు దిక్కుల ఐదుముఖాలతో దిఙ్ముఖమూర్తిగా ఉంటాడు. శివుడుకి మూడునేత్రాలుండటం అందరు ఎరిగినదే. అలాగే హనుమంతుడికి కూడా పంచముఖరూపంలో ప్రతిముఖానికీ మూడేసి నేత్రాలుంటాయి. అందుకే త్రిపంచనయనం అన 3×5=15 కళ్ళు కలవాడుగా పైశ్లోకంలో కీర్తింపబడ్డాడు.

‘అలంకారప్రియో విష్ణుః అభిషేక ప్రియ శ్శివః” అని హరిహరులను గూర్చి చెప్పబడింది. విష్ణువు అలంకార ప్రియుడు. అలాగే హనుమంతుడు కూడా అలంకార ప్రియుడే. ఆ విషయం పై శ్లోకంలో ‘నానాలంకరణం’ గా చెప్పబడింది. శివుడిలా హనుమంతుడు అభిషేకప్రియుడు కూడా. వేదంలో ‘మన్యుసూక్తమ్’ అని ఒక సూక్తం ఉంది. మన్యుదేవత రుద్రశక్తియే. అటువంటి మన్యుసూక్తంతో అభిషేకం చేయటంవలన హనుమంతుడు పరమానందభరితుడవుతాడు. మన్యుసూక్తపారాయణవల్ల, మన్యుసూక్తాభిషేకం వలన బాధలనుండి విముక్తులయినవారు, అభీష్టాలు నెరవేర్చుకున్నవారు ఎందరో ఉన్నారు. ఈశ్వరాంశసంభూతుడవటంవలన శివాలయాలలో కూడా ఆంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్టలు జరిపి ఆరాధించటం ఉన్నది. కాబట్టి లోకంలో శివకేశవభేదభావాలు తొలగి సమైక్యతతో జీవించటానికి మార్గదర్శకుడు హనుమంతుడు. (సశేషం)

శ్రీరామ జయ రామ జయజయ రామ

[wp_campaign_2]

[wp_campaign_3]