శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

Sri Prasannanjaneya Swamy - శ్రీ ప్రసన్నాంజనేయస్వామి అవతారము
Sri Prasannanjaneya Swamy - శ్రీ ప్రసన్నాంజనేయస్వామి అవతారము

శిష్యుడు – గురువుగారూ! ద్వాపరయుగ చరిత్ర చెప్పారు. తరువాత హనుమంతుడు కూడా ఏవో అవతారాలెత్తాడని అంటారు. వాటిని గూర్చి కాస్త తెలుసుకోవాలని ఉందండి.

గురువుగారు – అలాగే, ఏదైవమైనా ముఖ్యంగా రెండు ప్రయోజనాల కోసం అవతారా లెత్తడం జరుగుతుంది. అదే విషయం భగవద్గీతలో కృష్ణ భగవానుడు

‘పరిత్రాణాయ సాధూనాం – వినాశాయ చ దుష్కృతాం |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ||’

అని చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా ఆ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే రెండు ముఖ్య ప్రయోజనాలకోసమే తొమ్మిది అవతారాలెత్తాడు. వానినే హనుమన్నవావతారాలంటారు. వానిని పరాశరమహర్షి 1.ప్రసన్నాంజనేయస్వామి అవతారం, 2.వీరాంజనేయస్వామి, 3.వింశతి భుజానేంజనేయస్వామి, 4.పంచముఖాంజనేయస్వామి, 5.అష్టాదశభుజాంజనేయస్వామి, 6.సువర్చలాంజనేయస్వామి, 7.చతుర్భుజాంజనేయస్వామి, 8.ద్వాత్రింశద్భుజాంజనేయస్వామి, 9.వానరాకార ఆంజనేయస్వామిఅవతారం అని వివరించారు. అలాగే హనుమంతునకు సంబంధించిన పుణ్య స్థావరాలు కూడా పదమూడు ఉన్నాయి. వాటినే హనుమత్పీఠాలంటారు. అవి 1. కుండినగరం, 2. శ్రీ భద్రము, 3. కుశతర్పణము, 4. పంపాతీరం, 5. చంద్రకోణం, 6. కాంభోజం, 7. గంధమాదనం, 8. బ్రహ్మావర్తపురం, 9. బార్హస్పత్యపురం, 10. మాహిష్మతీపురం, 11. నైమిశారణ్యం, 12. సుందరీనగరం, 13. శ్రీ హనుమత్పురము – అనేవి.

[wp_campaign_1]

హనుమంతుని అవతారాలలో మొదటి అవతారం ప్రసన్నాంజనేయస్వామి. విజయుడనే మహావీరుడు ప్రసన్నాంజనేయు నారాధించి సంసార సముద్రాన్ని దాటగల్గాడు. సార్థక నామధేయుడు కాగల్గాడు. ఈ అవతార చరిత్రే చంద్రకోణమనే హనుమత్పీఠ చరిత్ర, అష్టాక్షరీ హనుమన్మంత్ర ప్రభావ చరిత్ర ఉండేది. సర్వసమృద్ధికల ఆ పట్టణానికి రాజుగా విజయుడు అనే మహావీరుడుండేవాడు. అతడు ప్రశస్తమైన విల్లు కలవాడు. యుద్దం చేయటంలో మంచి ఉత్సాహం కలవాడు. ఆ మహావీరుడు, రాజశ్రేష్టుడు అయిన విజయుడు ఒకప్పుడు రాజ్యభారమంతా కుమారునిపై పెట్టి దిగ్జైత్ర యాత్ర చేయదలచాడు. ఆ కోర్కె సాధించటంకోసం బయలుదేరాడు. మార్గమధ్యంలో అతనికి గర్గమహాముని కన్పడ్డాడు. ఆ రాజశ్రేష్టుడు మునిని చూడగానే అశ్వందిగి సైన్యాన్ని దూరంలోనే నిల్పి వచ్చాడు. తలవంచి గర్గ మహామునికి నమస్కరించాడు. గర్గమహాముని అతనితో ‘రాజశ్రేష్టా! ఇటురా. నీవు ఎక్కడనుండి వస్తున్నావు? ఈ నీ ప్రయాణం ఎక్కడిదాకా సాగుతుంది? అందరూ కుశలమేకదా? నీ శత్రు సామంతులు బలాత్కారంగా పన్నును చెల్లిస్తున్నారా?’ అని అడిగాడు. ఆ జయశీలుడు వెంటనే ‘ఓ మహామునీ! మీ అనుగ్రహంవల్ల మేమందరం కుశలంగానే ఉన్నాము. ఓ స్వామీ! నేను దిక్కులన్నీ జయించాలనే కోరికతో చంద్రకోణం నుండి బయలుదేరి వస్తున్నాను. తమ దర్శన భాగ్యంచే ఈరోజు ధన్యుడనయాను. ఇక ముందు నాకు తగు కర్తవ్యాన్ని మీరే ఉపదేశించి దీనుడనైన నన్ననుగ్రహించండి. నాకు మీరే శరణం’ అన్నాడు. శిష్యవత్సలుడైన ఆ ముని ‘ఓ విజయా! నీకు మేలయిన మార్గం చూపుతాను. హనుమన్మంత్రాలలో సులభ సాధ్యమైన అష్టాక్షరీ మహా మంత్రం ఉపదేశిస్తున్నాను. దానివలన ప్రసన్నాంజనేయుడు నీకు సులభంగా ప్రసన్నుడౌతాడు. యోగులకు సహితం దుర్లభమైన ఈ మంత్రం గూర్చి వినినందువల్లనే జన్మ సాఫల్యత చేకూరుతుంది.

‘ఆంజనేయమతి పాటలాననం – కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తరుమూలవాసినం – భావయామి పవమాననందనం’

అనే ధ్యానం కల్గిన ఈ మంత్రానికి ఈశ్వరుడే ఋషి. దీని పురశ్చర్యవల్ల సర్వకార్యసిద్ధి, ముల్లోకాలలో కీర్తి చేకూరటమే కాక అవసానంలో మోక్షాన్ని కూడా పొందుగల్గుతారని ఆ అష్టాక్షరమంత్రాన్ని ఉపదేశించాడు.

[wp_campaign_2]

విజయుడా మంత్రాన్ని ఇంద్రియ నిగ్రహంతో స్వీకరించాడు. దాని నుపదేశించిన గురువునందు, ఆ మంత్రమునందు, దాని అధిష్టానదైవము హనుమంతునియందు పరిపూర్ణమైన విశ్వాసముంచి నూట ఎనిమిది పర్యాయములు జపించాడు. జపించినంతనే భక్తానుగ్రహశీలి అయిన హనుమంతుడు సుగ్రీవాదులతో కూడినవాడై విజయుని ఎదుట ప్రత్యక్షమయాడు. ఆ వచ్చిన వాయునందనుని చూస్తూనే విజయుడు సాష్టాంగ నమస్కారము చేసి బహుధా స్తుతించాడు. ఆ స్తోత్రానికి సంతసించిన హనుమంతుడు విజయుని ఏవరం కావాలో కోరుకోమన్నాడు. వినయంతో విజయుడు ‘ఓ స్వామీ! నేడు నీదర్శనంచేతనే ధన్యుడనయాను. బ్రహ్మాదులకుకూడా దుర్లభమైన ఈ నీ దర్శనమే శ్రేయస్కరమైనది. కాని నాకొక తీవ్రమైన కోరిక ఉంది. సర్వదిక్కులని జయించాలనేదే ఆనాకోర్కె. నాకోరిక తీరునట్లుగా నాయందనుగ్రహం చూపవలసింది’ అని ప్రార్థించాడు. ఆ ప్రార్థన విని మారుతి ‘ఓ బుద్దిమంతుడా! నీవు తప్పక దశ దిశలనూ జయింపగలవు. కాని అది ఇప్పుడు కాదు. ద్వాపరయుగంలో నీవు ఇంద్రుని వరప్రసాదునిగా పుడతావు. రణరంగంలో శ్రీకృష్ణునే రథసారధిగా పొంది విజయనామంతోనే కౌరవులను జయించి అనంతరం దశదిశలూ జయింప గల్గుతావు. పెక్కు మాట లెందుకు? నీవలన నేనే పరాజితుడ నౌతాను. నీవు కపిధ్వజునిగా కీర్తి పొందుతావు’ అని హనుమంతుడు వరమిచ్చి అంతర్థానం చెందాడు. విజయుడు కూడా దైవాజ్ఞను శిరసావహించి గురువుకు నమస్కరించి తన పట్టణానికివెళ్లాడు.

ఈ చంద్రకోణ మహారాజు విజయుడే ద్వాపరయుగంలో అర్జునునిగా పుట్టాడు. బాణాల వంతెన నిర్మించి కపిధ్వజుడయాడు. ఇదే చంద్రకోణమనే హనుమత్పీఠ చరిత్ర, హనుమదష్టాక్షరీ మహా మంత్ర వైభవ చరిత్ర, హనుమంతుని మొదటి అవతారమైన ప్రసన్నాంజనేయస్వామి అవతార చరిత్ర కూడా.

[wp_campaign_3]