Press "Enter" to skip to content

శ్రీ హనుమద్వ్రతము – వ్రత విధానము – హనుమద్వ్రత కథలు – పంచమ అధ్యాయము

Suvarchala sahitha Hanuman

 

మార్గశిర మాసమున శుద్దత్రయోదశి హనుమద్వ్రతము.

మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. ఈ మాసమునందు శుధ్ధత్రయోదశి ప్రధానమైనది.

మార్గశీర్షే త్రయోదశ్యాం – శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్వా దేవీ జనకాత్మజా – మహావీరేణ ధీమతా ||

అని చెప్పబడుటచే ఈ దినముననే హనుమంతుడు సీతాదేవిని చూచినాడు. ఈరోజు హనుమంతుని పూజించినవాని కోరికలు తీరి దుఃఖనివృత్తి అగునని సీతమ్మతల్లి వరమొసగినది.

వ్రత విధానము
ఈ వ్రతమునకు ముఖ్యమయిన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. క్రిందటి దినమునుండే వ్రతయత్నములు గావించుకొనుచు శుచియై గడిపి బ్రాహ్మీ ముహూర్తముననే లేచి గురుధ్యానముతోబాటు యథోచిత కృత్యము లొనర్చి వ్రతమునకు సంకల్పింపవలెను.

హనుమంతుడు పంపాతీరమున విహరించుడు కాన ఈ వ్రతమును పంపాతీరముననే కావింపవలెను. అది యందులకు అసాధ్యము కాన పంపాతీరమునకు బదులు పంపాకలశము నేర్పాటుచేసి దాని నారాధించి దాని ప్రక్కనే హనుమద్వ్రతమాచరించినచో హనుమంతుడు పంపాతీరమున వ్రత మాచరించునట్లు సంతసించి యనుగ్రహించును.

వ్రతారంభమునకు ముందుగానే అవసరద్రవ్యములను సమకూర్చుకొనవలెను. పీఠము, పట్టువస్త్రములు, వలయు కలశములు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు షోడశోపచార ద్రవ్యములు, హనుమత్ప్రతిమ, లేదా యంత్రం, పదమూడు ముళ్లుగల తోరము వంటివాని నన్నింటిని సిద్ధము చేసికొని, బంధుమిత్రాదులందరనాహ్వానించి శుచియై వ్రతమునకు సంకల్పింపవలెను.

శ్రీ హనుమద్వ్రత కధలు
పంచమ అధ్యాయము

శ్రీ పరాశరులవారు చెప్పుచున్నారు. ఓ మైత్రేయా హనుమద్వ్రత ప్రభావమిట్టిది. ఈ వ్రత మాహాత్యమును పఠించినను వినినను జయమును పొందుదురు. సర్వవ్రతముల ఫలమునిచ్చు వేరొకవ్రతమును చెప్పుచున్నాను. హనుమద్వ్రతము వెంటనే విజయము నొసంగునట్టిది. రహస్యముగానుంచదగినట్టినది. ఆదివారముతో కూడిన హస్తానక్షత్రమున వెనుకటిరీతిగనే హనుమత్ప్రభు నర్చింపనగును.

మైత్రేయ మహామునీ! పండ్లనుగాని, హవిస్సునుగాని పాలనుగాని ఆహారముగా గొనుచు వెనుక తెలిపిన ముద్రిక ధరించి వందమార్లు మంత్రమును జపించనగును. తోరమును కట్టుకొని లేదా జందెమున నుంచుకొని సాధకుడగువాడు అశుచుల స్పర్శ లేనివాడై సవితృదేవతాక మగు హస్తానక్షత్రమందెప్పుడూ ముద్రికను పూజింపవలెను. సంవత్సరము పూర్తికాగా వేరొక క్రొత్తతోరమును ధరింపవలెను. వెనుక చెప్పిన బంగారముతో చుట్టబడిన ముద్రిక నొక్కదానినే అశుచులచే నెప్పుడూ తాకబడనిదానినే ధరింపవలెను. ఆదివారమున వచ్చు సవితృదేవతాకమగు హస్తానక్షత్రమున నీవ్రతమును చేయువాడు ప్రయత్నపూర్వకముగ గురువు నర్చించి వాయన మీయనగును. అట్లిచ్చినవాడు హనుమత్కథ జెప్పుకొన్నవాడై యెల్లప్పుడు విజయము నందువాడగును. ధనధాన్య సమృద్ధి, పుత్రపౌత్రాదికమును పొంది దేవేంద్రసమమగు నున్నవాడై రాజులను, స్త్రీలను, నరాధిపులందరిని తమ ప్రాణధనములతో సహ దాసులు చేసికొనును. దీర్ఘాయువును, ఆరోగ్యమును గోప్ప వాక్సిద్ధిని, గొప్ప సమృద్ధిని పొంది సకలభోగముల ననుభవించి కోర్కెల నన్నిటి బొంది చివరకు పరమున తారక బ్రహ్మము నంది ముక్తుడగును.

ఓ మైత్రేయమహామునీ! ఈ హనుమద్వ్రతమును అష్టాక్షరీ మంత్రముతో ఏ శ్రేష్టమగు హనుమన్మంత్రముతో నయిన జేయనగును. పూర్వము శ్రీకృష్ణుడు రథసారథిగా గల మహాబాహుండగు నర్జనుడ హస్తాదిత్యవ్రత మాచరించి యష్టాక్షామంత్రమును జపించి సాటిలేని బలము నంది యెల్లప్పుడు విజయమును పొందెను. భీమసేనుడు మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, హస్తల యైదునక్షత్రములందు హనుమద్వ్రతము చేసి సమస్తములగు శత్రువుల జయించెను. ప్రత్యక్షముగనే వరప్రదాతయగు నా మహనీయుని బూజించనిది యెవరు? ఆ హనుమంతుని బ్రహ్మ, విష్ణు, శివాదులు సైతము నర్చించుచున్నారు.

హనుమంతునితో సమానమగు దైవత మీ భూతలమున లేనేలేదు. ఈ ప్రమాణమే హనుమద్వ్రతమే శ్రేష్టమగు జయసిద్ది నిడునది యని తెల్పును. శ్రీ హనుమంతుడు పూజింపబడుటవలన సూర్యుడు, బ్రహ్మ, గౌరి, మహేశ్వరుడు, జానకీపతియగు శ్రీరాముడు,సర్వసమర్థు డగు సాక్షాన్నారాణుడు ఈశాన, దేవేంద్రాది దిక్పాలురు, కుమారస్వామి, వినాయకుడు, వశిష్ఠాది బ్రహ్మర్షులు సనకాదియోగులు పితరులు, అష్టవసువులు,ఏకాదశరుద్రులు అందరు పూజింపబడుదురు. అనగా హనూమత్పూజ చేసిన పైవారందరిని పూజించినట్లే అందుచే జయమును కోరువాడు మహాత్ముడు, శ్రీరామప్రియ సేవకుడగు హనుమంతుని సప్రయత్నుడై పూజింపనగును.

ఎవ్వడు నిత్యము దీనిని వినునో, లేక శ్రధ్దతో వినిపించునో అతడు సమస్తములగు కోర్కెలు పొంది బ్రహ్మలోకము నందును. చంద్రుడు లేని రాత్రి, ధనములేని రోజువలెనూ మైత్రేయా హనుమన్నామము లేని ప్రబంధము వ్యర్థమగును. మైత్రేయా! హనుమద్భక్తులు, పుణ్యమూర్తులగు నీల, విజయ, ధ్వజదత్త, గాల, మైంద, అంగద, భరత, సుషేణ, హారీత, కశ్యప, పుష్కర, సోమదత్తులను స్మరించుచున్నాము.

ఇతి శ్రీ హనుమద్ వ్రత కథాయాం ఫలశ్రుతి ర్నామ పంచమోధ్యాయః సమాప్తః

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: