Hanumadvratamహనుమద్వ్రతము

హనుమంతుని ముఖ్యమగు పర్వదినములలో ఇది యొకటి. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతము. ఆనాడు పంపాతీరమున వ్రతము గావింపవలెను. అట్లు కాకున్న పంపాకలశము స్థాపించి తోరగ్రంథి పూజాదులతో కావింపవలెను.

వ్రత విధానము

ఈ వ్రతమునకు ముఖ్యమయిన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. ఆ రోజు కుదరనిపక్షమున ఏదో యొక మృగశిరానక్షత్రమునాడు కాని, వైశాఖ బహుళ అమావాస్యనాడు కాని, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ బహుళ అమావాస్యనాడు కాని, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసములందు శుక్లపక్షమున గల శనివారములందు కాని, శ్రావణ పౌర్ణమినాడు కాని, కార్తీక శుధ్ద ద్వాదశియందు కాని ఆచరింపవచ్చును.

హనుమంతుడు పంపాతీరమున విహరించువాడు కాన ఈ వ్రతమును పంపాతీరముననే కావింపవలెను. అది యందులకు అసాధ్యము కాన పంపాతీరమునకు బదులు పంపాకలశము నేర్పాటు చేసి దాని నారాధించి దాని ప్రక్కనే హనుమద్వ్రతమాచరించినచో హనుమంతుడు పంపాతీరమున వ్రత మాచరించినట్లు సంతసించి యనుగ్రహించును. పంపాతీరమున వ్రతమాచరింపాజాలనివారు గంగా, గోదావరి, కృష్ణానదీత్యాది పుణ్యనదుల తీరమునగాని, గోశాల, తులసీవనము, పర్వతాగ్రము, అశ్వత్థాది పుణ్యవృక్షముల సమీపమునగాని, అదియు సమకూడనివారు స్వగృహ, దేవాలయ, వసతిగృహాదులందైనను వ్రత మాచరింపనగును.

పూర్తి విధానము, కల్పముగల “శ్రీ హనుమద్వ్రతము” అను గ్రంథమునందు అన్ని విషయములు విపులముగా పొందుపరచబడినవి. ఈ గ్రంథము చూచి ఏ పురోహుతులైనను వ్రతము చేయింపగల్గుదురు. భక్తు లీవ్రతమును సత్యనారాయణ వ్రతము వలె పర్వదిన, శుభకార్యములందు జరుపుకొనవచ్చును.

హనుమద్వ్రత విధానము, ఆ వ్రత సంబధ విషయాలను, సందేహాలకు సమాధానములను గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారు వివరించిన videos ఈ క్రింద పొందుపరుస్తున్నాము.