Press "Enter" to skip to content

హనుమంతుని కధలు – హనుమంతునిచే గరుడ, సత్యభామల గర్వభంగం

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

 Garuda Bird with Lord Vishnu

శిష్యుడు- బాగుందండీ! ఇంతేనా? మరేదయినా ద్వాపరయుగంలో హనుమంతుని చరిత్ర కన్పడుతుందా?

గురువుగారు- అలా భీమార్జున గర్వభంగాలే కాకుండా హనుమంతుని వలన గరుడ గర్వభంగం జరిగిన వృత్తాంతం కూడా ద్వాపరయుగంలో చూడగల్గుతాము.

[wp_campaign_1]

శిష్యుడు- ఏదీ సెలవియ్యండి.

గురువుగారు- ఆ విను. హనుమంతుడు గంధమాదన పర్వత ప్రాంతంలో బంగారు అరటి తోటలలో నిత్యం నివసిస్తూ ఉంటాడు. ఏ కోర్కె లేనివాడైనా లోకానుగ్రహకాంక్షతో పరివారంతో కూడి శ్రీ రామచంద్ర పాదద్వయ ధ్యానతత్పరుడై ఉంటాడు. ఒకప్పుడు గరుత్మంతుడు తన బలాన్ని ఎంచుకొని గర్విస్తూ ఇలా అనుకున్నాడు. “దేవతలందుకాని, రాక్షసులందుకాని, నరులందుకాని,సర్పజాతియందుకాని యక్షులందుకాని నాయెదుట యుద్దంచేసి నిలువగల వాడెవ డున్నాడు? నన్నెదిరించి ప్రాణాలతో బ్రతుకగలవాడీ ముల్లోకాలూ గాలించినాలేడు. పర్వతాలు మోయటంలో కీర్తింపబడవచ్చు. కాని వానరులు కూడా నాతో సమానులెలా కాగలరు? నేను లోకమంతటిని ఉదరంలో వహించి దేవదానవులకు కదల్పటానికి కూడా శక్యంకాని దేహం కల్గిన సాక్షాత్తు నారాయణమూర్తినే నా రెక్కలమీద మోస్తున్నాను” అని అనుకొంటూ గర్వంతో గరుత్మంతుడు మైమరిచి ఉన్నాడు. ఇది తెలిసిన యదుకుల భూషణుడు శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో సత్యభామతో రత్నసింహాసనం అధిష్టించిఉండి గరుత్మంతుని గర్వాన్ని పోగొట్టదలచి తనలో అతణ్ణి స్మరించాడు. వెంటనే అతి వేగంతో ఆ గరుడుడు వచ్చాడు. కృష్ణునకు అంజలి ఘటించి ఆజ్ఞకోసం నిరీక్షించాడు. అంతట కృష్ణుడు “ఓ వినతా తనయా! అమిత వేగము కలవాడా! మహాబల పరాక్రమ సంపన్నుడా! బంగారు అరటిచెట్లచే రమ్యమైన గంధమాదన పర్వతం మీద ధ్యానమగ్నుడై భక్త సులభుడు, ధర్మాత్ముడు అయిన హనుమంతుడున్నాడు. నేనాతనితో మాట్లాడవలసి ఉంది, కాబట్టి అతని నిక్కడికి తోడ్కొని రావలసింది” అని అజ్ఞాపించాడు. వైనతేయుడు మనసును మించిన వేగంతో తక్షణమే గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిశ్చలంగా మనసున ధ్యానం చేసుకుంటూ ఉన్న వానర శ్రేష్టుడైన హనుమంతుని చూచాడు. అతని ఎదుట గర్వంగా నిలబడి గరుడుడు అనేక పర్యాయాలు పిలిచాడు. “ఓ వానరశ్రేష్టా! మహాత్ముడైన శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ యోగాన్ని చాలించు. ఓ మహాజ్ఞానీ! ఆలస్యం చేయకు. శ్రీకృష్ణుని శాసనం అతిక్రమింపతగనిది కాబట్టి నిన్ను తీసికొని వెళ్ళనిదే ఇక్కడనుండిపోను” అన్నాడు. స్థిర యోగంలో శ్రీరామచంద్రుని పాదద్వయమునందే ధ్యానముంచి నిశ్చలమనస్కుడై ఉన్న వానరవంశ శ్రేష్టుడైన హనుమంతుడు ఈ బాహ్య విషయాన్ని దేనిని గమనింపలేదు. అప్పుడు గరుత్మంతుడు కృష్ణాజ్ఞనాలోచించుకొని భయపడి హనుమంతునియందు అల్పభావంతో తన ముక్కుని హనుమంతుని ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు సర్వ ప్రాణుల అంతః కరణములందు సంచరించే హనుమంతుడు, గరుత్మంతుడు చేసిన వికార చేష్టలను గుర్తించికూడా గుర్తించనట్లున్నాడు. ఇంకా నిశ్చలుడై మెదలకుండా ఉన్న మారుతి చెవికడ తన ముక్కునుంచి గరుత్మంతుడు మరల పిలిచాడు.ఇంతలో హనుమంతుడు యోగాన్ని ఉపసంహరింప నెంచినవాడై యధావిధి ప్రాణాయామం విరమింపసాగాడు. యోగవేత్త అయిన హనుమంతుడు ముక్కు కుడిరంధ్రం ద్వారా వాయువుని విడిచి, ఎడమ ముక్కు రంధ్రంచే వాయువును పీల్చినవాడై, ముక్కు లోపల వాయువును కుంభిస్తూ ఉన్నాడు. ఆ హనుమంతుని యోగం గరుత్మంతుని పాలిటి భయంకర ప్రయోగ మయింది. ప్రాణాయామంలో మారుతి గాలిని విడిచేసమయానికి ఆ గాలిచే గరుత్మంతుడు దూరంగా నెట్టివేయబడుతున్నాడు. మరల పీల్చేటప్పుడు ముక్కుదగ్గరకు ఈడ్చుకొని రాబడుతున్నాడు. కుంభకంలో వాయువును నిరోధించినప్పుడు గరుడుడు కూడ ముక్కు చివర నిరోధింపబడుతూ పితృదేవతలను తలచుకొనటం మొదలట్టాడు. ఇలా అతనికి ప్రాణాలు పోయేటంతటి పీడ ఏర్పడింది. హనుమంతుని ప్రాణాయామం పూర్తి అయేసరికి గరుత్మంతుడు విడుద లయాడు. తనకు కల్గిన క్షోభవల్ల, కృష్ణాజ్ఞ మీరినందువల్ల చాల కోపమువచ్చి ప్రళయ కాలాగ్నిలా మండిపదుతూ ఆకాశాన్ని నొక్కుతూ పలుసార్లు వేగంగా పై కెగిరాడు. హనుమంతుని అమాంతంగా తీసికొని పోనెంచుకొని దేహాన్ని బాగా పెంచి వీపుభాగం మేఘాలని ఒరుసుకొనేటట్లు ఎగిరి లోకాన్ని, ఆంజనేయుణ్ణి చూస్తూ ఆతనిని పట్టుకొనిపోయే ఆలోచనతో వర్తులాకారంగా తిరగసాగాడు. ఆ గరుత్మంతుని పట్టుకొనటంకోసం మేఘాలని తాకేటట్లుగా తన తోకను పెంచాడు. గరుడుడు దాన్ని చూచి పొడవైన కట్టుకొయ్య అనుకున్నాడు. బాగా తిరగటంవలన ఏర్పడిన శ్రమను పోగొట్టుకొనటంకోసం విశ్రాంతికై దానిమీద నిలబడ్డాడు. సూర్య సంచారాన్నే నిరోధిస్తూ ఉన్న ఆ హనుమద్వాలాన్ని గుర్తించి దానిని ఛేదిద్దామని అలోచించాడు. పెద్దదైన తన ముక్కు కొనతో దేవేంద్రుడు వజ్రాయుధంతో హనువును వేదించినట్లుగా తోకను పొడవనారంభించాడు. ముక్కుతో పోటు పొడవబడిన హనుమంతునికి త్రిపురాసురినియందు శంకరునికి వచ్చినంత కోపం గరుత్మంతునిపై వచ్చింది.

[wp_campaign_2]

తోకచివర ఉన్న గరుత్మంతుణ్ణి వరుణపాశంతో సమానమైన రోమాలతో గ్రుడ్డును పట్టినట్లు పట్టి బంధించాడు మారుతి. గట్టిగా బంధించటం వల్ల శ్వాసక్రియ కూడా జరుగునట్టి యంత్రశిలవంటి గరుత్మంతుని రెట్టించిన వేగంతో ఒక్క విసురు విసిరాడు. తోకచే చితుకకొట్టబడిన అవయవాలతో యమునికి చిక్కినట్లు చిక్కిఉన్న ఆ గరుడుడు బలంగా పావనితోకతో విసరటంతో ఆపశక్యంకానివాడై శ్వేతదీపంలో పడ్డాడు. దాంతో రెక్కల మొదళ్ళు విరిగిపోయాయి. గుహ్యాంగాలు దెబ్బతిన్నాయి. ముక్కుకొనలు చితికిపోయాయి. అలా ఆ పాలసముద్రంలో మునిగాడు. క్షీరసముద్ర జల స్పర్శవల్ల మరల మొలచిన రెక్కలు కలవాడై పాలసముద్రం ఒడ్డున కొంత సమయం విశ్రమించి ద్వారకానగరం వెళ్ళాడు. వాడిపోయిన ముఖంతో అణగారిన బలగర్వంతో శ్రీకృష్ణుని చూచాడు. సిగ్గుతో తలవంచి ఎదురుగాఉన్న గరుత్మంతునితో దాచుకొంటున్నా బయటపడుతున్న చిరునవ్వులు కల శ్రీకృష్ణుడు చల్లగా ఇలా అన్నాడు. “ఓ పక్షీంద్రా, అలా నిలుచున్నా వేమిటి? నిర్విణ్ణుడవై ఉన్న కారణమేమిటి? జరిగిన వృత్తాంతమంతా నాకు చెప్పు. అనగానే గరుత్మంతుడు సిగ్గుతో తలవంచుకునే ఇలా అన్నాడు. “ఓ దేవదేవా! జగన్నాయకా! నీ మాయవలన చరాచర జగత్తంతా మోహంచెంది ఉంది. బలగర్వంతో ఉన్న నేను ఇక్కడనుండి వెళ్ళి గంధమాదన పర్వతంపై యోగనిష్టలో ఉన్న హనుమంతుని చూచాను. నీ ఆజ్ఞను వినిపించాను. అయినా అన్యచింతనలో ఉన్న ఆంజనేయుడు నా మాట వినలేదు.’ అనగానే ఆశ్చర్యభావం ప్రకటిస్తూ కృష్ణుడు ‘ఛీ! ఏమిటి ఆలస్యం? అతనిది నియమరహితమైన జపంలాగుంది. వెంటనే వెళ్ళి వానిని తీసికొనిరా. నా కా మారుతితో పని ఉంది.’ అన్నాడు. అది వెంటనే భయకంపితుడైన గరుత్మంతుడు తల వంచుకొని దీనంగా ‘దేవదేవా! నా గర్వమణటంకోసం నా పాలిటి మృత్యువే ఆ వానరరూపంలో ఉన్నాడు. ఇది నిశ్చయం. ఆ హనుమంతుడున్న దిక్కుకు త్రిసంధ్యలందూ దణ్ణం పెడుతున్నాను. ఆ పని తప్ప మరేదయినా చేస్తాను. అతని జోలికి వెళ్ళేపని మాత్రం వద్దు’ అని గరుత్మంతుడు చెప్పేసరికి శ్రీకృష్ణుడు నవ్వుతూ నర్మగర్భంగా ‘ఓ పరాక్రమశాలీ! ప్రకృతి విరుద్దమైన ఈ భాషణం నీకు తగదు. నీ పరాక్రమానికి ఎక్కడా అడ్డు ఉండదు. అతడు కేవలం వనంలోని పండ్లు తిని చెట్లపై సంచరించే కోతియే కదా! పరిహాసం వదిలిపెట్టి వెంటనే ఆతనిని తీసికొనిరా’ అని అతి దీనుడా అయిన గరుడునితో ‘గరుత్మంతా! ఈమారు నీవు రామనామం చేస్తూ వెళ్లు. వెళ్ళి ‘వానరా! నిన్ను సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడు’ అని చెప్పు అన్నాడు. కాదనలేక ప్రాణములం దాశ వదలుకొనే మరల కృష్ణుడు చెప్పినట్లే ‘సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడు’ అన్నాడు. అంతే హనుమంతుడు కన్నులు తెరచి యోగంవీడినవాడై ‘నేను ధన్యుడనైనాను. రామ నామామృతంవలన నా చెవులకు సుఖం చేకూరింది. ‘ఓ ఖగరాజా! ఇవిగో సకలోపచారాలు’ అని పూజించి ‘ఓ స్నేహితుడా! నీవునాకు పూజ్యుడవు. ఏడీ నా రాముడు? అతడెక్కడ డున్నాడో అక్కడకు వెళ్దాము, నా భుజముల నెక్కు. లేదా ముందు నడుస్తూ దారిచూపు’ అనగానే భుజాలెక్కే సాహసంచేయని గరుత్మంతుడు ముందు నడుస్తూ త్రోవ చూప నారంభించాడు. మనోజవులైన ఇద్దరూ క్షణంలో ద్వారకకు చేరారు. హనుమంతుని రాక తెలిసి కృష్ణుడు క్షణంలో రఘురామునిగా మారాడు. సత్యభామను చూచి ‘నీవు సీతవు కావలసిం’దన్నాడు. అలాగే అని యత్నించింది కాని సత్యభామ కది సాధ్యం కాలేదు. ఆమెను తొందర చేస్తూ కృష్ణుడు ‘అడుగో పావని వస్తున్నాడు, వెంటనే నీవు సీతవు కాకపోతే మనకూ గరుత్మంతునిలా గర్వభంగం తప్పదు’ అన్నాడు. ఇది తనకు పరీక్షగా గ్రహించి సత్యభామ తనబాధ రుక్మిణికీ కల్గాలని ఆమెకు కూడా సీతగా కావటం అసాధ్యమే అనే నమ్మకంతో ‘ఓ హరీ! నీకు రుక్మిణియందు ప్రీతి ఉంటే ఈపని ఆమెచే చేయించటం శ్రేయస్కరం. నేనీపని చేయజాలనంది.’ వెంటనే కృష్ణుడు వేగిరపాటుతో ‘సత్యా! అడుగో హనుమంతుడు సమీపించాడు. నీకు జానకీరూపందాల్చే ధీరత లేకపోతే వెంటనే ఈ పనికై రుక్మిణినయినా అజ్ఞాపిస్తా నన్నాడు.’ సిగ్గుతో తలవంచి సత్యభామ ‘ఈ కార్యం రుక్మిణి మాత్రం ఎలా చేయగలదు? నేను చేయలేనిపని చేయటం ఆమెకూ సాధ్యంకాదు’ అంది. వెంటనే కృష్ణుడు రుక్మిణిని జానకి అగున ట్లాజ్ఞాపించాడు. తక్షణం రుక్మిణి రామ సహధర్మచారిణి అయిన జానకీమహాదేవి అయింది. ద్వారకానగరం అయోధ్యగా కానవచ్చింది. అక్కడ సీతతో కూడి సింహాసన మధిష్టించి ఉన్న రామునిచూచి హనుమంతుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాడు. అనంతరం అంజలి ఘటించి పరమానందంతో వేదాంత పూర్ణమైన స్తోత్రాలు చేశాడు. ఆనందాశ్రువులతో గానంచేస్తూ నృత్యం చేశాడు. శ్రీరాముడు కుశల ప్రశ్నలు వేయగా మారుతి వినమితుడై ‘రామా! భక్తులపాలిటి రక్షకుడవై నీవుండగా అశుభాలు ఎక్కడనుండి వస్తాయి? సూర్యుడు తూర్పు కొండపైకి రాగా చీకటి ఎలా ఉంటుంది’ అన్నాడు. అంత శ్రీరాముడు ‘ఓ హనుమంతా! భక్తులలో శ్రేష్టుడవైన నీయందు యోగ్యలక్షణాలన్నీ ఏకత్రితమై ఉన్నాయి. నీ ప్రమాణం వలననే మేము కలకాలం లోకంలో ఉంటాము. నీవునాకు ప్రాణ సమానుడవు. ఓ హనుమంతా! ఇటు రా! ఈ మణిహారం తీసుకో. ఎప్పుడూ దీని నుపేక్షింపక.’ అని, ‘దూర ప్ర్రయాణంచే అలసిఉన్న నీవు ఫల భరితమైన గంధమాదన పర్వతానికి వెళ్ళు’ అన్నాడు. హనుమంతు డా రామాజ్ఞను, రామమాలికను శిరసావహించి మరల ప్రదక్షిణ నమస్కారములు చేసి రాముని అనుమతితో తన నిత్య నివాసమైన గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. (ఇంకా ఉంది)

[wp_campaign_3]

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: