శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

Sri Veeranjaneya Swamy - శ్రీ వీరాంజనేయస్వామి అవతారము
Sri Veeranjaneya Swamy - శ్రీ వీరాంజనేయస్వామి అవతారము

శిష్యుడుః శ్రీ హనుమంతుని రెండవ అవతారం వీరాంజనేయ చరిత్ర గురించి చెప్పుకొనాలండీ.

గురువుగారుః అవును. శ్రీ హనుమంతుని రెండవ అవతారం వీరాంజనేయస్వామి అవతారం. సుందరీనగరమనే హనుమత్పీఠంయొక్క దివ్యచరిత్ర ఇది. అంతేకాక అష్టాదశాక్షరీ మహా మంత్ర ప్రభావ చరిత్రకూడా. ఈమంత్రానికి అగస్త్యుడు ఋషి. గాయత్రీ ఛందస్సు. హనుమాన్ దేవత.ఈ మంత్ర అధిదేవత అయిన వీరాంజనేయ అవతారమూర్తి ధ్యానం –

[wp_campaign_1]

“చింతి తార్థ ప్రదం దేవం – శాన్తాకారం మహాప్రభుమ్
సంతతం చింతయేత్ చిత్తే – హనూమన్త మనూపమమ్ ||
మనోజవం మారుతతుల్యవేగం – జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యూధముఖ్యం – శ్రీరామదూతం శిరసానమామి ||”

అనేది. ఈఅవతారమూర్తిని పూజించి ఈ మంత్రజపము ద్వారా ధన్యులయినవారిలో ముఖ్యుడు మైందుడనే బ్రాహ్మణశ్రేష్టుడు. అతడు మహాజ్ఞాన సంపన్నుడు. పరమపవిత్రుడున్ను. వేదశాస్త్రాల తత్వాలు తెలిసిన అతడు సుందరీనగరంలో ఉంటూ ఉండేవాడు. నిరంతరం అష్టాదషాక్షరీ మంత్ర జపనిష్టలో ఉంటూ హనుమంతుని వీరమూర్తిని సేవస్తూ ఉండేవాడు. ధర్మతత్పరుడై సంచరించేవాడు. తపోధనుడైన ఆ మైందునికి ఒకమారు కాశీ వెళ్ళాలనే కోర్కె కల్గింది. ఆ సమయంలో గంగానది దాటశక్యం కాకుండా ఉప్పొంగి ఉంది. అయినా కాశీయాత్ర యందలి ఇష్టంకొద్దీ ఒక నావ నెక్కి బయలుదేరాడు. గంగానది మధ్యలోకి వెళ్ళేసరికి నావ దెబ్బతిని నీటితో నిండటం మొదలుపెట్టింది. ఆ పరిస్థితిని గమనించి మైందుడు కలతపడ్డాడు. ఇక తన జీవితంపై ఎటువంటి ఆశా లేదు. ఆ చివరి క్షణాల్లో తన ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండటమే కర్తవ్యంగా తలచాడు. ముఖంతో సహా శరీరమంతా ఉత్తరీయంతో కప్పుకున్నాడు. బాహ్య సమాలోచన మాని హనుమద్భక్తితో కూడి పరిశుధ్ధమైన మనస్సు కలవాడై హనుమంతుని అష్టాదశాక్షరీ మంత్రాన్ని జపింపనారంభించాడు. క్షణంలో ధ్యానమగ్నుడై సర్వమూ మరచాడు.

కొద్ది సమయానికల్లా పెద్ద కలకల ధ్వని ఏర్పడి ధ్యానానికి భంగం కల్గింది. కళ్ళు తెరచి చూచేసరికి తాను ఒడ్డుకువచ్చి ఉన్నాడు. ఒడ్డున ఉన్న జనమంతా కోలాహలంగా శబ్దం చేస్తున్నారు. హనుమద్భుక్తుడైన మైందుడు ఆ నావను దిగాడు. తీరమందు ఆశ్చర్యంతో గోల చేస్తూ ఉన్నవారిని చూసి తానూ ఆశ్చర్యపడుతూ ‘ఓ జనులారా! అకారణంగా మీరింత ఆశ్చర్యపడుతూ చూస్తున్నారేమిటి? జరిగినదేమిటో చెప్పండి. నది మధ్యనుండి నేనిక్కడికెలా రాగల్గాను? నాకు తెలియజేయండి’ అన్నాడు. అంతట ఆ జనులు ‘ఓ బ్రాహ్మణోత్తమా! నీ వెక్కిన నావను ఒక పెద్ద కోతి నెత్తిన పెట్టుకొనివచ్చి ఈ ఒడ్డున పెట్టిపోయింది. ఎన్నడూ చూడని ఆశ్చర్య సంఘటన వలన అంతగా ఆశ్చర్యపడుతున్నాము’ అన్నారు. వారిని చూచి మైందుడు ‘ఓ జనులారా! నన్ను బ్రతికించటానికి వచ్చిన ఆ కోతి మహావీరుడైన హనుమంతుడు తప్ప వేరుకాదు. ఆ మహానుభావుని దర్శించిన మీరు అదృష్టవంతులు, ధన్యులు, పుణ్యవంతులు. నేను నిరంతరం శ్రీహనుమత్పూజను, రామపూజను చేస్తూనే ఉన్నాను. కాని ఎన్నడూ నాకు కలలో కూడా దర్శన మీయలేదు. నేను పాపాత్ముణ్ణి. దురదృష్టవంతుణ్ణి. సమస్తములైన కోర్కెలు తీర్చగలిగిన హనుమంతుడు నాకు దర్శనం ఈయనప్పుడు ఈ నా జన్మ వ్యర్థం. ఇప్పుడే ఈ గంగా నదిలో పడతాను’ అని గంగానదిలో పడి ఆత్మత్యాగం చేయబోయాడు మైందుడు. ఇంతలో ఆ భక్తునియందు వాత్సల్యబుద్ధితో ధీరుడు, పట్టు పీతాంబరాలు ధరించినవాడు, సర్వ సంపదలు కలవాడు, నవ్వుతూ ఉన్న మోము కలవాడు, దయాసముద్రుడు అయిన హనుమంతుడు వెంటనే మైందుని ఎదుట ప్రత్యక్షమయాడు. అలా దర్శనమిచ్చిన హనుమన్మహావీరుని చూస్తూనే మహాతపశ్శాలి అయిన మైందుడు సాష్టాంగనమస్కారం చేశాడు. ఆనందబాష్పాలతో కాళ్ళు కడిగి

“ఉష్ట్రారూఢ! సువర్చలా సహచరన్ సుగ్రీవ మి త్రాంజనా
సూనో! వాయుకుమార! కేసరి తనూజాక్షాది దై త్యాంతక!
సీతాశోక హరాగ్నినందన! సుమిత్రా సంభవ ప్రాణద!
శ్రీ భీమాగ్రజ! శంభుపుత్ర! హనుమన్| పంచాస్య! తుభ్యంనమః”

అని బహుధా ప్రార్థించి ఆర్ఘ్య, పాద్య, గంధ, ధూప దీపములతో, వివిధ ఫలాలతోను మైందుడు ఆ వాయునందనుని పూజించాడు. మైందునిచే చేయబడిన పూజను స్వీకరించి హనుమత్స్వామి సంతృప్తి చెందినవాడై అతనికి అనేక వరాలిచ్చి ‘ఓ మైందా! భక్త సంరక్షణ కొరకై నే నెప్పుడూ భక్తుల వద్ద వసిస్తూనే ఉంటాను. నాకు అనన్య భక్తుడైన నీవు ఇహలోకంలో సమస్త భోగాలను అనుభవించి చివరకు నాస్థానానికి చేరుకుంటావు’ అని పల్కి అంతర్థానం చెందాడు. ఇది రెండవ హనుమదవతారమైన వీరాంజనేయస్వామి చరిత్ర.

చైత్ర మాసములో పుష్యమీ నక్షత్రం వచ్చిన రోజున ఈ మైందుడు హనుమంతుని పూజించి సంపూర్ణ సఫల మనోరధు డయ్యాడు. కాబట్టి ప్రతి చైత్రమాసంలో వచ్చే పుష్యమీ నక్షత్రం హనుమత్పర్వదినం. నాటి అర్చనవల్ల హనుమంతుడు సంప్రీతు డౌతాడు. (ఇంకా ఉంది).

[wp_campaign_2]