Press "Enter" to skip to content

శ్రీ హనుమద్వ్రతము – వ్రత విధానము – హనుమద్వ్రత కథలు – ద్వితీయ అధ్యాయము

Suvarchala sahitha Hanuman

మార్గశిర మాసమున శుద్దత్రయోదశి హనుమద్వ్రతము.

మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. ఈ మాసమునందు శుధ్ధత్రయోదశి ప్రధానమైనది.

మార్గశీర్షే త్రయోదశ్యాం – శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్వా దేవీ జనకాత్మజా – మహావీరేణ ధీమతా ||

అని చెప్పబడుటచే ఈ దినముననే హనుమంతుడు సీతాదేవిని చూచినాడు. ఈరోజు హనుమంతుని పూజించినవాని కోరికలు తీరి దుఃఖనివృత్తి అగునని సీతమ్మతల్లి వరమొసగినది.

వ్రత విధానము
ఈ వ్రతమునకు ముఖ్యమయిన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. క్రిందటి దినమునుండే వ్రతయత్నములు గావించుకొనుచు శుచియై గడిపి బ్రాహ్మీ ముహూర్తముననే లేచి గురుధ్యానముతోబాటు యథోచిత కృత్యము లొనర్చి వ్రతమునకు సంకల్పింపవలెను.

హనుమంతుడు పంపాతీరమున విహరించుడు కాన ఈ వ్రతమును పంపాతీరముననే కావింపవలెను. అది యందులకు అసాధ్యము కాన పంపాతీరమునకు బదులు పంపాకలశము నేర్పాటుచేసి దాని నారాధించి దాని ప్రక్కనే హనుమద్వ్రతమాచరించినచో హనుమంతుడు పంపాతీరమున వ్రత మాచరించునట్లు సంతసించి యనుగ్రహించును.

వ్రతారంభమునకు ముందుగానే అవసరద్రవ్యములను సమకూర్చుకొనవలెను. పీఠము, పట్టువస్త్రములు, వలయు కలశములు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు షోడశోపచార ద్రవ్యములు, హనుమత్ప్రతిమ, లేదా యంత్రం, పదమూడు ముళ్లుగల తోరము వంటివాని నన్నింటిని సిద్ధము చేసికొని, బంధుమిత్రాదులందరనాహ్వానించి శుచియై వ్రతమునకు సంకల్పింపవలెను.

శ్రీ హనుమద్వ్రత కధలు
ద్వితీయ అధ్యాయము

సూతుడు శౌనకాది మహామునుల కిట్లనియే. ఓ మునులారా! శ్రీ పరాశరుడు మైత్రేయునకు చెప్పినదానిని వేరొకకథను మీకు చెప్పుచుంటిని వినవలసినది. మైత్రేయుడు అడుగుచున్నాడు.ఓ పరాశరమహామునీ! మీచే వెనుకటి అధ్యాయమున హనుమద్వ్రతమని చెప్పబడినది. ఎవరు పూర్వము దాని ఫల మందెనో చెప్పగోరెదను. పరాశరులు చెప్పుచున్నారు. దేనిని ప్రతిరోజు వినుటద్వారా మానవుడు హనుమద్భక్తుడగునో యట్టి పాపనాశనకారియగు కథ వర్ణించెదను.

పూర్వము చంద్రవశమునందు ఉద్భవించినవాడు,ధర్మములన్నిటి నెరిగినవాడు, బంధుకోటితో కూడినవాడు అహంకార రహితుడునగు రాజు సోమదత్తుడను మహనీయడుండెను.అతడు సత్యము మాటాడువాడు, ఎల్లవేళల మౌనివలె వాచాలత లేనివాడు, అతిథుల మంచివారిని పూజించువాడు. పరాక్రమవంతుడున్నూ కలవరము లేనివాడై సముద్రమే మొలనులుగా గల భూమిని పాలించెను. శత్రువు లందరను నాశనము చేయుచుండువాడు. అట్టి శత్రువులందరుకూడి మహిష్మతీపురమున కేగిరి. సోమదత్తుని యుద్దమున కాహ్వానించిరి. కొన్నివేల అక్షౌహిణుల సేనతోను, పదివేల గజబలముతోను లక్షకోటుల కాశ్మీర దేశీయములగు గుర్రములతో కూడిన వారితో నా సోమదత్తునకు సంకులసమర మేర్పడెను. బల్లెము, చిల్లకోల, ఖడ్గములు, ఇనుపమొనలుగల భిండివాలములను నాయుధములతోను,రాళ్ళతోను దేవదానవ సంగ్రామమువలె ఆ యుద్ధము జరిగెను. ఇంక నేమని వర్ణింపనగును? శత్రువులచే జయించబడినవాడై సోమదత్తుడు రాణి దేవికతో సంతఃపురమునుండి గార్గ్యమహాముని యాశ్రమమున కేగెను.

అక్కడనే శోకముతో కూడినవాడై అయిదుమాసములుండెను. పిదప కుంటి, మూగ, గ్రుడ్డితనముల బొందెను. ధైర్యముకల యతని భార్య రాజ్యభ్రష్టుడై, మరల ఇష్టమును పొందుగోరుచు మిక్కిలి విచారించుచున్న పతినగూర్చి యుద్దమునందు చనిపోయిన బిడ్డల విషయమున దుర్లభములగు సంపద,రాజ్యము, భోగముల విషయమున, మాటిమాటికి నోదార్చునదై నాల్గు శ్లోకములను చెప్పెను. ఆపదలందు ధైర్యము అంచిత సంపదలందు ఓర్పు, సభలయందు శాస్త్రవిషయముల బాగుగ మాటాడు గుణము ఉండవలయును. యుద్ధమునందు పరాక్రమము, స్త్రీలకడ నచంచలత, సంపదలేర్పడినప్పుడోర్పు, బ్రాహ్మణునియందు భక్తియు ఉండవలెను. కాదగినది యగుచునేయుండును. కాకమానదు.ఎట్లన కొబ్బరికాయలో నీరు ఎవ్వరు పోయకున్నను సమయమున నేర్పడుచుండునుకదా! పోయేది యెట్లునుపోవును. ఎట్లన ఏనుగువెలగపండును మ్రింగగా దానిలో గుజ్జు హరించుకుపోయి శూన్యమగు డొల్ల తిరిగి వచ్చును. కన్పడకుండా లోనిది మాయమగును.

ఏద కాకున్నదో అది కాకమానదు. కాదగినది కాదుకూడ. ఈ యాలోచనకు నిశ్చయించుకొని యున్నవారికి చింత యుండదు. ఈరీతిగా నీతిశాస్త్ర కోవిదులగు పండితులు చెప్పుదురు. కావున ఓరాజా! నీవు శోకమును, పోయినవనిపై ప్రేమను, దేహమును నాశనముచేయు చింతను వీడుము. రాజా! ఇది గార్గ్యాశ్రమము. దీని సమీపమునకు ప్రవేశించుచున్నాము. ఆ ధర్మాత్ముడు దుర్లభములగు గోర్కెలసైత మీయగలడు. అని యూరడించి పిదప రాష్ట్రమువీడిన వీరుడగు నా యశక్తుడై నడవలేనివానిని ఆతని భార్య మెడయందు భరించును. పాపరహితమగు నా గార్గ్యాశ్రమమును ఆమె చేర్చెను. అగని నటనుంచి పలుమార్లు మునికి నమ్రురాలై అప్పుడు సాద్వ్హియైన, బలిసి యున్నతములగు కుచములుకల, చంద్రుని వంటి ముఖముకల, మంచివెంట్రుకలుకల, దొండపండువంటి పెదవికల, మధురముగ మాటాడగల, చెవులవరకు వ్యాపించిన నేత్రములుకల, వెన్నెలవలె స్వచ్చమగు కాంతికల, దేవికయను ఇరువదియేండ్ల ప్రాయంకల కోమలమగు నవయవములు కలదియు, శ్యామలవర్ణము కలదియు, కలువకంటి వడకుచు ధర్మబుద్దికలదై మునిని ‘రక్షింపుము, పతిని రక్షింపు’మని వేడెను.

మహనుభావా! శత్రువులచే పీడింపబడి పతితోకూడి వచ్చితిని. ఈరాజు రాజ్యము నుండి తొలగినవాడు. మిమ్మే శరణుపొంది యున్నవాడున్ను.ముని అప్పుడు మిక్కిలి ధ్యానము చేసి ధ్యానమార్గ నేత్రముతో చూచి సమస్తమగు విషయమును తెలిసికొనెను. మునిసత్తమగు గర్గుడు ఆరాణి ప్రియుడగు రాజునుగూర్చి ఇట్లు చెప్పదొడగెను. మీకేర్పడిన కష్టము చాలా గొప్పది. సర్వశూన్యమై మిక్కిలి సహింపరానిది. దేనిచే విధి యేర్పడినదో చెప్పెదను. విజయము నీయగల ఉత్తమమంత్రమును నీవనుష్ఠించలేదు. ఓరాజా! నీచే నుత్తమమగు వ్రతములు చేయబడలేదు. అందుచే నీ విట్టి భరింపరాని గతుల బడితివి. రాజు చెప్పుఛుండె. ఓ భగవంతుడవగు గర్గమునీ! మంత్రోపాసన విషయమున, వ్రతమునందును అశక్తుడను. అయినను శక్తికొలది చేయగలను. అన్ని మంత్రములకు మహారాజువంటిదై ఫలప్రద మగునట్టిదానిని, అన్నివ్రతముల కంటే శ్రేష్ఠమైన ఒక వ్రతమును దీనుడనగు నాకు చెప్పుడు. తమరు అందరియందును వాత్సల్యము కలవారు. ఎల్లప్పుడు దీనులయెడ ప్రేమకలవారు. నాయందును ఆరీతి కరుణగలవారైయున్నను నేను మీకు శిష్యుడనైతిని. అనుగ్రహింపుడు.

ఈరీతిగా రాజుచే జెప్పబడగా కీర్తిమంతుడగు నా వృద్ధగార్గ్యుడు క్షణము ధ్యానించి రాజుతో నిట్లనెను. కుమారా! వినుము. ఓరాజా! సమస్తవిద్యలకు సారభూతమైన హనుమత్పంచవక్త్రవిద్యయనుపేర నొక విద్య కలదు. నృపశ్రేష్టా! దాని నిచ్చెదను. అది వెంటనే పాపము లన్నింటిని పోగొట్టునది. సమస్తములగు బాధలను నివారించునది. సులభముగా జయము నిచ్చునట్టినది. సామ్రాజ్యము నిచ్చునది. ఓ దీర్ఘభుజుడా దానిని జపించుము. వెంటనే జయసిద్ధి కల్గును. హనుమత్ప్రభువు వ్రతము దెల్పెద వినుము.అది వెంటనే సమస్తములగు ప్రయోజనముల నిచ్చునది. యెల్లప్పుడు విజయమిచ్చునది. వైశాఖమా కృష్ణపక్ష దశమినాడు లేదా ఆపై అమావాస్యనాడైన,మాఘమాసము మొదలు ఐదుమాసములందు శుక్లపక్షమున మొదటిశనివారమునకాని మృగశిరానక్షత్రమునకాని, శ్రావణమాసమున పౌర్ణమియందుకాని, కార్తీకమాస శుద్ధద్వాదశియందు, అట్లే మార్గశిర శుద్దత్రయోదశియందుగాని ఈ వ్రత మాచరింప జెప్పబడినది. పైవానిలో నొకరోజు వ్రత మాచరింపవలెను. భక్తియుతుడైనయెడల నన్నిరోజులందు ఈవ్రత మాచరింపవచ్చును.

వ్రతారంభముననే తోరమును కట్టుకొని పిదప పూజ నాచరింపనగును. హనుమత్పూజను మిగిలిన రోజులందును ఆచరింపవచ్చును. తోరము మాత్రము మార్చనవసరము లేదు. ముందుగా గురుననుమతి పొందినవాడై బ్రాహ్మీ ముహూర్తమునకాని, సాయంత్రముకాని, మధ్యాహ్నముకాని, ఉదయమునకాని, హనుమంతుని పూజింపనగును. బంగారం, వెండి, రాగి మొదలగు యంత్రములయందుగాని, భూర్జపత్రమునందుగాని, పిండితో వేసిన యంత్రమందుగాని ఉదకపూరితమగు కలశమందుగాని, పట్టుగుడ్డయందుగాని, ప్రతిమలయందుగాని ఆవాహన మొనర్చి పూజింపనగును. పదమూడు ముడులతో గూడిన తోరమును ధరింపవలెను పదమూడు నేతియప్పములు వాయన మీయవలెను. ధనాదికముచే గురువును పూజింపవలెను. విత్తలోభముతో పూజించుట నిరర్థకమే.శక్తిననుసరించి బ్రాహ్మణ సమారాధనము గావించి వారితో భోజనము చేయనగును. సిద్ధిని కోరినవాడై పదమూడేం డిట్లు చేయనగును. దీనిచే జయింప దుర్లభులగు శత్రువుల నందరును, దేవతలనైనను జయించి చిరకాలము గొప్పరాజ్యము లభించినవాడవై యుందువు. నీ వెనుకటి సంపద, కీర్తి,పుత్రులు అన్నియు కల్గును.

ఈరీతిగా గార్గ్యమహామునిచే సోమదత్తుడు పంచవక్త్రహనూమత్సంబంధమగు మహావిద్యను భార్యసహితుడై చెప్పబడినవాడై గురుసమీపముననే యుండి ఆయుత్తమవ్రతము నొనర్చినవాడై వెంటనే యాయుష్మంతుడు, మన్మథసమానమగు రూపముకలవాడు నగు నతడు హనుమదనుగ్రహముచే ఖడ్గసిద్ది నందినవాడాయెను.అటుపిమ్మట ఒక్క పగటియందే సమస్త శతృవులను జయించి గార్గ్యమహామునిని పురొహితునిగా జేసికొని తన రాజ్యమును పాలింపజొచ్చెను. అందుచే గార్గ్యమహాముని కోటిసహస్రముల బంగారు నాణెములుపొంది వేయిసంవత్సరములు నాత్రయాగము చేసెను. గార్గ్యానుగ్రహమువలన రాజగు సోమదత్తుడు సప్తద్వీపవతియగు భూమిని మూడువందల సంవత్సరములు ధర్మాత్ముడై పాలించెను. ఎనమండుగురు పుత్రులను బడసినవాడై పెద్దకొడుకును రాజ్యాభిషిక్తుని చేసి చివరకు ఆ కీర్తివంతుడు భార్యతోగూడినవాడై బ్రహ్మలోక మందెను మునిశ్రేష్టుడగు మైత్రేయా! హనుమంతుని వ్రతముయొక్క ప్రభావ మిట్లుండును. ఈ వ్రతమును విన్ననూ, పఠించిననూ ఎల్లప్పుడు, విజయము నిచ్చును.

ఇతి శ్రీ హనుమద్వ్రత కథాయాం సోమదత్త చరిత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: