శ్రీరామ
జయ హనుమాన్

Hanuman Ring

బాహబల సాధనలో హనుమంతుని ఆదర్శంగా గ్రహించిన మనకు ఆయన బుద్ధిబలం విషయంలో సందేహం కల్గటం సహజం. ఎందుకంటే అంత ఆసాధారణ బాహుబలసంపన్నులకు బుద్దిబలం ఉండే అవకాశం లేదు. అవి రెండూ పరస్పరవిరుధ్ధ శక్తులు. అట్టి విరుద్దశక్తులు ఏకమై ఉండటం, గొప్పగా ఉండటమే హనుమంతునిలోని విశిష్ట లక్షణం. అసామాన్య బాహుబలం కల హనుమంతుడు బుద్దిమతాం వరిష్టుడు, జ్ఞానినా మగ్రగణ్యుడు.

మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియమ బుద్దిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి ||

అని కీర్తించనివారుండరు. కేవలం అలా కీర్తించటమేనా? అది యధార్థమా? అని అలోచిస్తే పై విషయం పూర్తి సత్యం. ఆ మహనీయుని బుద్ధిమతాం వరిష్టునిగా మనం గుర్తించటం కాదు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే గుర్తించాడు. శ్రీహనుమద్రాముల ప్రథమ సమావేశంలోనే ఆ గుర్తింపు కన్పడుతుంది.

రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపాతీర ప్రాంతానికి వచ్చారు. వారిని చూచిన సుగ్రీవడు వాలి తనను చంపుటకై పంపినవారుగా అనుమానించి వారి విషయం తెలిసికొని వచ్చుటకై హనుమంతుని పంపాడు. హనుమంతుడు రామలక్ష్మణులను కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆ హనుమంతుని మాటలు వింటూనే రాముడు పల్కిన పల్కులలో హనుమంతుని వాక్చాతుర్యాన్ని ఎంతగానో పొగడడం తెలిసికొనగల్గుతాము. అలా హనుమంతుని బుద్ధిశక్తిని సాక్షాత్తు శ్రీరాముడే కొనియాడాడు. అసలు ‘హనుమంతుడు’ అంటే బుద్దిమంతుడు అని అర్థం అంటారు మధ్వాచార్యులవారు. ‘హనుశబ్దో జ్ఞానవాచీ చ హనుమా నితి శబ్ధతః’ అనేది వా రిచ్చినవివరణ.

అతులితబలధామం స్వర్ణశైలాభదేహం
దనుజవనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్
సకలగుణనిధానం వానరాణా మధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి ||

అనే హనుమంతుని స్తుతిలో జ్ఞానినా మగ్రగణ్యుడుగా చెప్పబడ్డాడు. జ్ఞానము అనేది ప్రకటమయినప్పుడే గుర్తింపబడుతుంది. ఒక పండితుడు, ఒక పామరుడు ఇర్వురూ పట్టువస్త్రములు, శాలువాలు ధరించి కూర్చొనియున్నప్పుడు ఇర్వురను పండితులనియే భావిస్తాము. వారు నోరు తెరచి మాటాడినప్పుడు మాత్రమే వారిలో పండితుడెవరో, పామరుడెవరో గ్రహింపగల్గుతాము. ఆవిధంగానే బుద్ధిశక్తి వాగ్రూపంగానే తెలియబడుతుంది. ‘అతిరూపవతీ సీతా – అతివాజ్నిపుణః కపిః’ అని చెప్పబడింది. అంటే సీతాదేవివంటి అందగత్తెలేదు. ఆంజనేయునంతటి వాక్చాతుర్యం కలవాడు లేడు అని అర్థం. అలా బుద్ధిశక్తి హనుమంతుని వాక్చాతుర్యరూపంలో ఎప్పుడూ వెలువడుతూనే ఉంటుంది.

హనుమంతుడు సీతాన్వేషణకోసం సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించాడు. ఆమె రాక్షసీగణంచే బాధింపబడుతూ రావణుని ప్రగల్భాలతో, బెదిరింపులతో చాలా దుఃఖిత అయి ఉన్నది. అంతే కాదు. చాలా నిస్పృహ చెంది ఉంది. ఆ దశలో హనుమంతుడు కన్పడటంవలన ఆమెకు ప్రాణములు లేచి వచ్చినట్లనిపించింది. నిర్వేదంలో ఉన్న ఆమె హనుమంతునితో ‘శ్రీరామచంద్రుడు సేనతో నూరు యోజనముల సముద్రము దాటిరాగలడా? ఈ రాక్షస సేనను జయించి నన్ను రక్షింపగలడా? అని అనుమానం వ్యక్తం చేస్తూ ప్రశ్నించింది. అందుకు సమాధానంగా హనుమంతుడు ‘అమ్మా! సుగ్రీవునిసేనలో పదిఏన్గుల బలం కల యోధులు, నూరుఏన్గులబలం కలయోధులు, ఇంకా అనేక శక్తి యుక్తులు కలవారున్నారు. వారిలో తక్కువ వాడనయిన న్ను ఈ కొద్ది మాత్రపు పనికి పంపారు’ అనటంద్వారా తనకంటే మహావీరులు వానరసేనలో ఉన్నారని తెల్పి సీతాదేవికి చాలా ధైర్యము చేకూర్చినవాడయాడు.

అలాగే సీతాదేవివార్త కోసం నిరీక్షిస్తున్న వానరులతో ‘దృష్టా సీతా’ అని మొదలెట్టి చెప్తాడు. తొలిపదం ‘దృష్టా=చూడబడినది’ అని చెప్పుటలో ఆ ఒక్కపదముతోనే వారి ప్రాణాలు కాపాడినంత పని చేస్తాడు. అదే విషయం రామునివద్ద చెప్పునప్పుడు ‘నియతగా సీత క్షేమంగా ఉన్న’దని ఆమెశీలవతీత్వాన్ని ముందు చెప్తాడు. రామునకు సీత నియమబద్ధగా ఉండటమే బ్రతికి ఉండుటకన్న ముఖ్యం. అందుకే ఆధర్మస్వరూపునకు అలా చెప్పాడు. ఈ విధమయిన వాజ్నైపుణం సర్వత్రా హనుమంతుని యందు చూడగల్గుతాము. కాబట్టి బుద్ధిశక్తిలో హనుమంతుని మించినవారు లేరు. అతని వాజ్నిపుణత మనకు ఆదర్శం. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో హనుమంతుని ద్వారా మనం గ్రహింపవచ్చు. (సశేషం)

శ్రీరామ జయ రామ జయజయ రామ

[wp_campaign_1]

[wp_campaign_2]

[wp_campaign_3]