Press "Enter" to skip to content

మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు – 1

శ్రీరామ
జయ హనుమాన్

Lord Hanuman-Rama-Sita

‘ధర్మ ఏవ హతో హన్తి’ అంటే ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనలను దెబ్బతీస్తుంది. సరిగా నేటిపరిస్థితి అదే. ధర్మం ఎన్నివిధాల మానవులచే నాశనం చేయబడుతుందో అన్ని విధాల మానవాళి వినాశం కొనితెచ్చుకొంటోంది. అనుక్షణం జరుగుతున్న దారుణాలను గూర్చి విచారిస్తున్నారే తప్ప దానికి నిజమైన కారణాలను గుర్తించటం లేదు. అందుకే కళ్ళముందున్న వినాశనానికీ సరైన పరిష్కారం ఎవ్వరకీ కానరావటం లేదు. ధర్మరక్షణ జరిగిననాడే ఈ వినాశంనుండి మానవాళి రక్షింపబడుతుందనేది సత్యం. అదొక్కటే పరిష్కారం.

ధర్మం అనేది ఒకరు చెప్పటం, వేరోకరు నేర్చుకోవటం వలన వచ్చేది కాదు. ధర్మం ఆచరణ రూపమైనది. అలా ఆచరించటానికికొక మంచి ఆదర్శం కావాలి. నేటి స్థితిగతులలో మానవాళికి ఏకైక ఆదర్శం హనుమంతుడు. ధర్మసేవ చేయాలనుకొనేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజమయిన ధర్మసేవకుడతడే. హనుమంతుడిని రామసేవకుడని చెప్పుకొంటాం. అక్కడ రామశబ్దాన్ని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నదానినిబట్టి ధర్మంగానే స్వీకరించాలి. అలా ఆంజనేయుడు చేసినది ధర్మసేవే. ధర్మరక్షణకోసం రాముడు అవతరిస్తే అతనిరూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. నేడు మరల ఆ చిరంజీవి ఆవాహన చేసికొని మాత్రమే ధర్మాన్ని రక్షించుకోగల్గుతాం.

త్రేతాయుగంలో రావణాదులను వధించి ధర్మాన్ని రక్షించటంకోసం శ్రీరాముడు అవతారించాడు. ఆ ధర్మకార్యపూర్తి హనుమంతుడి సహకారంవల్లనే జరిగింది. ధర్మకారంకోసం మాత్రమే హనుమంతుడు రాముడితో ఉన్నాడు. రామసేవకుడయితే రాముడు పుట్టిననాటినుండీ ఆతనిసేవలో ఉండాలి. అలా కాక రాముడి ధర్మకార్యం ఆరంభమయినప్పటి నుండి మాత్రమే హనుమంతుడు రాముడితో ఉన్నాడు. అందుకే రాముడికీ, ఆంజనేయుడికీ పరిచయం కిష్కింధాకాండదాకా జరగలేదు. అలాగే ధర్మకార్యం పూర్తికాగానే హనుమంతుడు గంధమాదన పర్వతంపై తపోనిష్టుడై భక్తుల ననుగ్రహిస్తూ ఉన్నాడు తప్ప రామునితో రాజభోగాలలో గడుపలేదు. అంతే కాదు ధర్మంకోసం ఆ రామునకు కూడా ఎదురునిల్చాడు. అదే రామాంజనేయయుద్ధగాధ. కాబట్టి ధర్మంకంటే ఎవ్వరూ ఎక్కువ కారనే అద్భుత ఆదర్శం హనుమంతుడిలో చూడగల్గుతాం. ధర్మకార్యంలో తన అవసరం ఉన్నపుడల్లా రాముడికి తోడు నిలిచాడు. అలా త్రేతాయుగంలో ధర్మస్థాపనలో కీలకపాత్ర వహించినవాడు హనుమంతుడు. రామరావణయుద్ధమనే ధర్మయుద్ధంలో విజయకారకుడు హనుమంతుడు.

ద్వాపరయుగంలో ధర్మాధర్మాలమధ్య జరిగినయుద్ధం కురుక్షేత్ర సంగ్రామం. అందులో ధర్మం విజయం సాధించింది. అటువంటి ద్వాపరయుగధర్మవిజయంలో కూడా హనుమంతుడిది కీలకపాత్రే. కాకుంటే త్రేతాయుగంలో ధర్మవిజయానికి ప్రత్యక్షంగా కారణం కాగా ద్వాపరయుగధర్మవిజయానికి పరోక్షంగా కారకుడయాడు. కురుక్షేత్రసంగ్రామవిజయం తర్వాత భీమార్జునుల భుజస్కంధాలమీదే ఉంచబడింది. అటువంటి భీమార్జునులను ఇరువురినీ బలపరీక్షపెట్టి, ధర్మరక్షకులకు గర్వం తగదని బోధించి, అభయమిచ్చి, అండగా నిలిచి వారి విజయానికి పరోక్షంగా కారకుడయినవాడు హనుమంతుడు.

విజయుడికి వరమిచ్చిన ప్రకారం అమ్ములవారధిని అవలీలగా పడగొట్టి కూడా ఓటమి నంగీకరించి అర్జునుడి రథంటెక్కెంమీద ఉండి ధర్మవిజయకారకుడయ్యాడు హనుమంతుడు. సౌగంధిక కుసుమాన్ని, పురుషమృగాన్ని తేవటంలో భీముడిని పరీక్షించి అనుగ్రహించి విజయవరం ఇచ్చినవాడు హనుమంతుడు.

“కపిధ్వజప్రభల అంధీభూతులన్ జేయవే” అని తిక్కన అన్నట్లు కౌరవసేన కళ్ళు హనుమంతుని తేజః ప్రభలతో బైర్లుకమ్మి యుధ్దం చేయటంలో అశక్తమయింది. హనుమంతుడు టెక్కెంమీద ఉన్నందువల్లనే శత్రుపక్షపు భయంకర ఆగ్నేయాస్త్రాదులవల్ల రధం దగ్ధం కాకుండా ఉందని శ్రీకృష్ణుడర్జునుడికి నిరూపించాడు. అలా ద్వాపరయుగంలోనూ ధర్మవిజయానికి కారకుడు హనుమంతుడు.

కలియుగంలో విదేశీయులధర్మీయులవలన ధర్మం సంకటపరిస్థితికి లోనయింది. ధర్మాన్ని సంరంక్షించి హిందూ సామ్రాజ్యపట్టాభిషిక్తుడయినవాడు ఛత్రపతి శివాజీ. ఆతడి గురువయిన సమర్థ రామదాసే అటువంటి విజయానికి ప్రధానకారణం. సమర్థ రామదాసును హనుమ దవతారంగానే చెప్తారు. సమర్థుడు హనుమంతుడినే సమాజం ముందు ఆదర్శంగానే నిల్పి వ్యాయామం, సాముగరిడీలు, యుద్ధతంత్రాలు, ఆయుధప్రయోగాలూ నేర్పి విజయాన్ని సాధించాడు. అలా కలియుగంలో ధర్మవిజయం హనుమదనుగ్రహంవల్లనే చేకూరినట్లు చరిత్ర చెప్తోంది.

కాబట్టి ఇతిహాసపురాణాలు, చారిత్రకసత్యాలు ధర్మరక్షణలో ఒకే ఒక్కదిక్కు హనుమంతుడినిగా చెప్తున్నాయి. సకలసద్గుణగరిష్టుడు. సర్వశక్తిసముపేతుడు అయిన హనుమంతుడిని ఆదర్శంగా స్వీకరించినప్పుడే మానవజాతి ధర్మరక్షణలో కృతకృత్యమై, నేటి ఘోర విపత్కరపరిస్థుతులనుండి బయటపడగల్గుతుంది. (సశేషం)

శ్రీరామ జయ రామ జయజయ రామ

[wp_campaign_1]

[wp_campaign_2]

[wp_campaign_3]

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: