Press "Enter" to skip to content

గోమాత విశిష్టత – 1

గోమాత

Cow
గోసంరక్షణ హిందూధర్మంలో ప్రధానాంశం. ‘మానవ వికాసక్రమంలో గోరక్షణ అన్నిటికన్నా మిన్నయైన అలౌకిక విషయంగా నాకు తోస్తున్నది’ అంటారు గాంధీజీ. మన సంప్రదాయం గోవుకు సమున్నతస్థాన మిచ్చింది. ఒకవిధంగా ఆలోచిస్తే గోవు ప్రతి పుణ్యకార్యానికి అవసరమే. గోవు మన సంప్రదాయంతో అవిభాజ్యసంబంధం కల్గి ఉంది. గోవును తీసేస్తే మన సంప్రదాయం లేనట్లే అని చెప్పాలి. శివుని వాహనమైన నంది గోసంతతి. అది లేని శివాలయం లేదు. గోక్షీరం లేనిదే శివాభిషేకం కాదు. విభూది నిర్మాణం ఆవుపేడతోనే చేయ్యాలి. కావున శైవసంప్రదాయాన గోవు అవిభాజ్యం. గోపాలబాలకృష్ణుడు లేని వైష్ణవము లేదుకదా! సంక్రాంతి పండుగరోజులు పంటలువచ్చిన సుఖప్రదమైన కాలం. గంగిరెద్దులను గౌరవిస్తూ మనం ఆసుఖాలకు నోచు కొంటాము. గోమయం లక్ష్మీస్థానం. దానితో గొబ్బిదేవతను ఇంటిముంగిటనుంచి కొలుస్తాము. అబోతును వదలడం, గోవృషభవివాహం వంటివి ఉత్తమగతులీయగలవని, అనేకములైన పాపాలను పోగొట్టగలవని గ్రహిస్తాము. నాగులచవితినాడు ఆవుపాలతో సర్పపూజ చేయాలి. ప్రతి ఒక్కరికీ ఆనాడు ఆవు ఎక్కడ ఉండునో అనే ఆలోచన వచ్చితీరుతుంది. పుట్టినది మొదలు చనిపోవువరకూ, చనిపోయిన పిదపకూడా ప్రతి శాంతికలాపమునందూ గోదానవిధి తెలియబడుచునే ఉంటుంది. మనుజుడు చనిపోయిన పిదపకూడా వాని సద్గతికై గోదానం చేస్తారు. చనిపోయినవారి కర్పించే పిండాలను గోవుమాణిక్యం ఆరగిస్తేనే వానికి ధన్యత. పిండప్రదాన కార్యక్రమంలో ఆవుపేడ అవసరం. ఎటువంటి అశౌచమేర్పడిన స్థలాలందైనా ఆపును కట్టివేయడం, అవు పంచితమును చల్లడమువలన ఆ దోషము నశిస్తుంది. చేతబడులవంటి దుష్టప్రయోగాలు గోవు ఉన్నచోట పారవని, అట్టి దుష్కృత్యాలు చేయదలచినవారు పరిసరాలలో ఆవు లుంటే వాటిని తోలేస్తారని చెప్తారు. ‘సప్తకోటి మహామంత్రాః చిత్త విభ్రమకారకాః’ అని కొందరు అదో వేలంవెర్రిగా మంత్రాలు స్వీకరిస్తారు. వాటినన్నటినీ నిత్యం అనుష్టింపలేరు. ‘మంత్రాత్యాగే దరిద్రతా’ అని వాటిని నిత్యం చేయక వీడరాదు. రోగగ్రస్తులు, వార్థక్యబాధితులు అగువారు చేయలేని మంత్రాలను ఆవుచెవిలో చెప్పి వదలాలి తప్ప కేవలంగా వీడరాదు. భగ్న విగ్రహాలు తీసి నూతనవిగ్రహాలు ప్రతిష్టించేదశలో ఆ భగ్నవిగ్రహాలను ఆవుతోకకు కట్టి తీసికొని వెళ్ళి వదిలివేయించడం సంప్రదాయం. తోకకు ప్రమాదమేర్పడునట్లుకాక కర్తవ్యాన్ని శాస్త్రార్థం నిర్వహించాలి. నూతన గృహ ప్రవేశములో ఆవునుముందు ప్రవేశపెట్టడం సకల దోషపరిహారం. ఇలా మన హిందూసాంప్రదాయంలో గోవుకు చాలా ముఖ్యపాత్ర ఉంది. అటువంటి గోజాతిని రక్షించుకొనటం, పెంపొందించుకొనడం అత్యవసరం. అంతకంటే ముందు దాని విశిష్టతనూ, స్ఠితిగతులనూ గ్రహించడం మన కర్తవ్యం.

గోమాత విశిష్టత: మన సంప్రదాయం అడుగడుగునా గోవుకు ప్రధాన్యత నిచ్చిందంటే గోవు విశిష్టత ఎట్టిదో గ్రహించాలి. ‘నలుగాలివాన గోవును’ అని నాల్గుకాళ్ళుగల జంతువులలో గోవు శ్రేష్టమైనదిగా చెప్పబడింది. ‘మనిషికన్నా తక్కువస్థాయిలో ఉన్న సమస్తప్రాణుల ప్రతినిధి గోవు’ అంటారు జాతిపిత. ఆవుమీద ఒట్టు పెడుతున్నామంటే జాతికి ఆవుపై ఉన్న భక్తికి అది నిదర్శనం. మనమంతా గేదెపాలను త్రాగుతున్నాం కాబట్టి గేదెమాతను పూజించాలి. గోమాత పూజ ఎందుకు? అని ఒక వ్యక్తి గొప్ప తెలివిచూపుతూ వాదించాడు. ఉత్తరాది రాష్ట్రాలలో చాలామంది ఆవుపాడినే వినియోగిస్తారు. ఆవుకు, గేదెకు హస్తిమశకాంతరం ఉంది. శివుని వాహనం నంది కైలాసానికి తీసికొనిపోతే యముని వాహనం దున్నపోతు యమలోకానికి తీసికొనిపోతుంది. వాతి స్త్రీజాతిలోనూ అంతతేడా ఉంది. ఆవుకి, గేదెకి మధ్య చాలా తేడాలున్నట్లు విజ్ఞులు గుర్తించారు. గేదెపాలలో కొలెస్ట్రాల్ భాగం ఎక్కువ. అంతర్జాతీయ హృద్రోగ నిపుణులు డా. శాంతిలాల్ షా చెప్పిన ప్రకారం గేదెలవల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఆవుపాలలో అట్టిదోషం ఉండదు. నేటికాలపు మరణా లనేకం గుండెపోటువల్ల వచ్చేవే. ఇంగ్లండు, అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ, రష్యా, జపాన్ మొదలైన దేశాలలో ఆవుపాలనే వాడతారు. గేదెపాలు వాడరు. మనలో కూడా బి.పి. హార్ట్ ఎటాక్ వచ్చినవారు ఆవుపాలనుమాత్రమే వాడి ఆరోగ్యం కాపాడుకోవచ్చుకదా! ఆవుపాలలో ఉన్న చురుకుదనం గేదెపాలలో లేదు. ఆవుదూడలు పాలు త్రాగుతూ మూడు రోజులకే ఎగిరి గంతులేయటం ప్రారంభిస్తే గేదెదూడలు నెలలు గడిచినా ఆ ఆవుదూడలవలె చురుకుదనం చూపలేవు. మన పిల్లలలో కూడా చురుకుదనం రావాలంటే ఆవుపాలు వాడటం మేలు. గేదెపాలు తాగి మందంగా తయారవటం కోరరాదు కదా! ఈ విషయంలో శ్రీహర్షమహాకవి కవిత్వం పండితులకుకూడా అర్థమయ్యేది కాదు. సమాజానికి అందని కవిత సమస్యకాగా శ్రీహర్షకవి వాగ్దేవతను సాక్షాత్కరింప జేసికొని ప్రార్థించాడు. ఆమె ఆయన కొక సూచన చేసింది. అదేమంటే నిత్యం  ఆవుపెరుగు వాడుటమాని గేదె పెరుగు వాడమని. అలా గేదె పెరుగువల్ల బుద్ది మందగించినందున కవితాక్లిష్టత తగ్గింది. కాబట్టి గేదెపాలు, పెరుగు వాడుకవల్ల బుద్దిశక్తి పెంచవచ్చు. ఇరవై గేదెల్ని ఒక చోట ఉంచి దూడలను వదిలితే తిన్నగా అవి తమ తల్లి దగ్గరకు పోలేవు. 50 అవుల్ని ఒకచోట ఉంచినా ఆవుదూడలు తమతల్లిని త్వరగా గుర్తించగలవు. ఈ తెలివిలోని తేడా అవి త్రాగే పాలలోనే ఉంది. అంతేకాదు. ఆవుదూడలకు పేర్లు పెట్టి పిలవటం అలవాటు చేస్తే వాటిలో వచ్చే గుర్తింపు, స్పందన గేదె దూడలలో రావు. ప్రమాదాలలో గేదె తన దూడను కూడ వదలి పారిపోతుంది. కానీ ఆవు తన దూడను రక్షించు కొనేందుకు సిద్దపడుతుంది. (ఇంకా ఉంది….)

 

[wp_campaign_1]

[wp_campaign_2]

[wp_campaign_3]

 

3 Comments

  1. P.N.BHUSHAN P.N.BHUSHAN October 7, 2011

    i am very happy.

  2. P.N.BHUSHAN P.N.BHUSHAN October 7, 2011

    OK

  3. k v s s ramaraju k v s s ramaraju August 3, 2012

    అయ్యా!

    నేను మి యోక్క వేబ్
    చదివాను అది చాలా బాగుండి.
    ఈ విసయములు మా మిత్రులకు కు వివరిచెదను.

    క్రుతజ్నలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: