శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

lord hanuman-rama-sita

శిష్యుడు – ఓహో! గురువుగారూ! హనుమంతునకు పెళ్ళయిందన్నమాట. మరైతే ఆ విషయం వాల్మీకి తన రామాయణంలో చెప్పలేదేమండి?

గురువుగారు – వాల్మీకి తన కావ్యానికి అవసరమైన విషయంవరకే చెప్తాడు కాని అవసరంలేని వానరుల, రాక్షసుల భార్యల గూర్చి ఎందుకు చెప్తాడు? ఇక విను.

సూర్య భగవనున కా పూర్వ విషయం స్ఫురణకువచ్చి హనుమంతుని తనలో ఎంతగానో మెచ్చుకున్నాడు. హనుమంతుని విద్యాభ్యాసం పూర్తి అయింది. ఇప్పుడు మారుతి సకల విద్యాసంపన్నుడు. స్నాతకోత్సవమునకు సిధ్దుడైనాడు. ‘గురువర్యా విద్యాదానం చేసిన మీకు గురుదక్షిణ సమర్పించుకొని సెలవు తీసికొంటాను. కాబట్టి మీ మనసున గల కోరిక తెలియజేయవలసింది’ అని అడిగాడు. సమయమెరిగిన సూర్య భగవాను డిలా అన్నాడు.”ఓ హనుమంతా! నీవు లోక సంరక్షణార్థం సముద్రమధనంలో జన్మించిన హాలాహలాన్ని భరించిన ఈశ్వరరూపుడవు. అగ్ని పుత్రుడవు. నా తేజస్సు విశ్వకర్మచే కొంత వేరుచేయబడినది. దానిని కూడ ఈ లోకం భరింపలేదు. దానిని భరించుటకు నీవే సమర్థుడవు. నానుండి పుట్టిన ఆ వర్చస్సును సువర్చలగా నా కుమార్తెగా నీకు కన్యాదానము చేయ నిశ్చయించాను. హనుమంతా భరించువాడు భర్త కాబట్టి ఆ సువర్చస్సును  భరించువాడవుగా సువర్చలకు భర్త కావలసినది. ఇదియే నాకు గురుదక్షిణ” అన్నాడు. వెంటనే హనుమంతుడు “ఓ లోకబాంధవా! నేను బ్రహ్మచర్య వ్రతమునే ఆజన్మాంతము పాలింప నిశ్చయించుకొన్నవాడను. కాబట్టి ఆ వ్రత పాలనను గురుదేవులుగా మీరు కాదన తగునా?” అన్నాడు. వెంటనే సూర్యభగవానుడు “ఓ పవన తనయా! ఈ సువర్చల అయోనిజ. మహాపతివ్రతకాగలది. ఈమెను చేపట్టుటవలన నీ బ్రహ్మచర్య వ్రతానికి భంగం కలగనట్లు గురుస్థానంలో ఉన్న నేను వరమిస్తున్నాను. ప్రాజాపత్య బ్రహ్మచారిగా నీవు బ్రహ్మచర్య నిష్టాగరిష్టునిగానే జీవింపగల్గుతావు. లోకకళ్యాణార్థం నీకు కళ్యాణ మేర్పడుటతప్ప నీ బ్రహ్మచర్య పాలనకు భంగంకాదు. నీవు పుట్టుకతోనే యజ్ఞోపవీతం కల్గిఉన్న బాలబ్రహ్మచారివి అట్టి బ్రహ్మచర్యమే నీకు శాశ్వత వ్రతంగా నిలుస్తుంది. భవిష్యద్బ్రహ్మవు కాబట్టి నాటి వాణీ స్థానం ఈ సువర్చల వహింపగల్గుతుంది” అన్నాడు. గురువాక్యాన్ని శిరసావహించాడు హనుమంతుడు. సూర్యుడు హనుమంతునకు సువర్చలను సమర్పించాడు. “జ్యేష్ట శుక్ల దశమ్యాంచ భగవాన్ భాస్కరో నిజాంసుతాం సువర్చలానామ్నాం – ప్రాదాత ప్రీత్యా హనూమతే” అని పరాశరులవారిచే ఆసువర్చలా కన్యాదానం జేష్ఠశుధ్ధ దశమినాడు జరిగినట్లు స్పష్టంగా చెప్పబడింది. ఆ రోజు బుధవారమని, ఉత్తరా నక్షత్రమని పరాశర మహర్షి చెప్పారు. ఉభయ పక్షములవారి ఆనందోత్సాహాలతో వివాహం వైభవోపేతంగా జరిగింది.

అనంతరం తాను తెల్పిన రీతిగా హనుమంతుడు బ్రహ్మచర్య నిష్టాగరిష్టుడై వర్తిల్లుచుండగా పతివ్రత అయిన సువర్చల తపోనిష్టురాలై ఉండిపోయింది. హనుమంతుడు శ్రీరామచంద్రుని సందర్శింప రామకార్య ధురంధరునిగా బయలుదేరుటకు నిశ్చయించుకొనగా సువర్చల మాత్రం తాను గంధమాదనపర్వతంపై తపోనిష్టలో నిలిచిపోయింది. హనుమంతుడు తల్లికి పాదాభివందనం చేసి కర్తవ్యం భోధించమన్నాడు.అంతట అంజన “నాయనా! నాకు వాలి సుగ్రీవులను సోదరులు ఇర్వురున్నారు. వారు నీకు మేనమామలు. వారు చాలాకాలంగా బధ్ధ విరోధంతో ఉన్నారు. వారిలో ధర్మపక్షం వహించిఉన్న సుగ్రీవుని ఆశ్రయించి రక్షకుడవై యుండవలసినది. ఏ పరిస్థితి యందునూ మరియొక మేనమామయైన వాలితో విరోధించి యుధ్ధానికి తలపడవద్దు” అని చెప్పింది.

ఆ విధంగానే హనుమంతుడు పంపానదీ తీరంలో ఉన్న కిష్కింధకు చేరి సుగ్రీవునకు మంత్రిగా వున్నాడు. రామ సుగ్రీవులకు సఖ్యత కూర్చి సీతాన్వేషణకై సముద్రం దాటి సీతను సందర్శించాడు. ఆమెకు రామముద్రికనిచ్చాడు. రావణసుతుడైన అక్షుని, మంత్రిపుత్రులను చంపాడు. లంకను భస్మం చేశాడు. సీతవద్ద చూడామణి గ్రహించి రామున కందజేసి సీతారాములకు జీవితముపై ఆశ మిగిలేటట్లు చేశాడు. అనంతరం సేతు నిర్మాణం గావింపించి వానరసేనతో లంకలో ప్రవేశించాడు. రాక్షస వీరులను సంహరించాడు. సంజీవి పర్వతం తీసికొనివచ్చాడు. కాలనేమి, మైరావణాది మహాశక్తిమంతులైన రాక్షసులను చీల్చిచెండాడాడు. రామవిజయ కారకుడై పట్టాభిషేకం గావించి రామసేవాతత్పురుడయాడు. రామకార్య ధురంధురినిగా విఖ్యాతుడైనాడు. త్రేతాయుగాంతంలో తన నిత్య నివాసమైన గంధమాధన పర్వతంపై తారకనామం జపిస్తూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావిస్తూ కాలంగడపసాగాడు.

[wp_campaign_1]

[wp_campaign_2]

[wp_campaign_3]