శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

Jaya Hanuman

శిష్యుడు – గురువుగారూ! చిరంజీవి అయిన హనుమంతుడు ద్వాపరయుగంలో భారతకాలంలో కూడా ఉన్నాడన్నారు – ఆ విషయం కాస్త తెలియజేస్తే వినాలని ఉంది.

గురువుగారు – అలాగే, తప్పకుండా. చిరంజీవి కాబట్టి హనుమంతుని చరిత్రకు అంతంలేదు. ద్వాపరయుగ చరిత్రకు తప్పక వినవలసింది కాబట్టి చెప్పుకొందాం.

పాండురాజుకు కుంతి యందు ఇంద్రుని వరంవల్ల అర్జునుడు పుట్టాడు. అతనికే విజయుడు అనే పేరుకూడా ఉంది. సకల కళావిదుడైన అర్జునుడు మేటివిలుకాడు. సవ్యసాచిగా యుద్దంలో పరాజయం ఎరుగనివాడు. అతనికి అన్ని దిక్కులను జయించాలని కోరిక కల్గింది. సకల పరివారాన్ని వెంటబెట్టుకొని తూర్పు దిక్కుకు బయలుదేరాడు. ఆ దిక్కున ఉన్న శత్రు రాజులను జయించి వారిని వెంటబెట్టుకొని దక్షిణ దిక్కుకు వెళ్లాడు. తన వింటి త్రాటి మోతలచేతనే దక్షిణ దిక్కున ఉన్న శత్రు రాజులను కదల్చి వేసినవాడై క్రమంగా ఇంకా దక్షిణానికి వస్తూ సేతువును చూచాడు. దానిని చూచి ఆశ్చర్యపడి తన వెంట వచ్చినవారిలో పెద్దలు, పూర్వజ్ఞులు అయిన వారిని చూసి ‘అది ఏమిటి?” అని అడిగాడు. వారు అర్జునునితో ‘రాజా! రఘుకులశ్రేష్టుడైన రాముడు దురాత్ముడైన రావణుని వధించటంకోసం  పెద్ద పెద్ద పర్వత శిలలతో సముద్రాన్ని బంధించాడు. నూరు యోజనాలు వ్యాపించిన ఇది సముద్రమునకు సేతువు’ అని చెప్పారు. ఆ మంత్రి సత్తముల, పండితుల వాక్యాలు, వివరణలు విని ఫల్గునుడు ఫక్కున నవ్వి ఇలా అన్నాడు. ‘స్వయంగా తాను ధనుస్సును పట్టగల్గి, బాణసంపదకూడా కల్గి ఉండి, ఆ రఘురాముడెందుకింత ప్రయాసననుభవించినట్లు? బాణ సమూహాన్ని బంధించి సముద్రం దాటటానికి అవకాశం ఉండగా ఆ మహాత్ముడు ఇంత ప్రయాస పడటానికి ప్రయోజన మేమిటో అర్థం కావటంలేదు’ అని విమర్శగా పల్కాడు.

రామనామం ఎక్కడ ఉచ్చరింపబడుతుందో అక్కడ హనుమంతుడుంటాడు. కాబట్టి రామవృత్తాంతం అలోచిస్తూ ఉండగానే అంజలి ఘటించి హనుమంతుడు అక్కడకి వచ్చాడు. గర్వమనే చీకటితో కప్పబడి ఉన్న నరునితో ఆ వానర శ్రేష్టుడు ‘ఓ రాజా! నీవే పరిహాసంగా ఇప్పుడు పల్కబడిన మాట ఉన్నదే. అది తప్పు. నీ మాటలు రమణీయంగా ఉన్నా విమర్శనా శుధ్దాలు కావు, యుక్తి సహితంగా లేవు. గొప్ప పర్వతాలతో సమానమైన ఎలుగుబంట్లు, కోతులు మొదలైన మహా బలగము బాణ సమూహంతో చేసిన మార్గాన సముద్రాన్ని ఎలా దాటగలదు? పక్షి వాలిన మాత్రం చేతనే బాణాలతో చేసిన వంతెన కూలుతుందే! అటువంటి మార్గాన్ని ఏ మనుష్య్డుడు విశ్వసించి ఏర్పాటు చేసుకొంటాడు? బాగా దాహం వేసినవాడికి మధురోదకం మాటుపరచి ఎండమావులు చూసినట్లుగా ఉంది నీ బాణాల వంతెన పద్దతి. లేకపోతే రఘుకుల శ్రేష్టుడు, సీతాపతి అయిన నా స్వామి తెలివి తక్కువ పని చేస్తాడా? నీ వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టు’ అన్నాడు. అంతేకాదు, ఇంకా కావాలంటే పరీక్షించుకో. నీవు శర పంజరాన్నినిర్మించు. అది నన్ను భరింపగల్గితే ఏనుగులు, గుర్రాలు,రధాలతో కూడిన నా శ్రీ రామచంద్రుని సేనను వహింపగల్గినట్లే అని కూడా అన్నాడు.

అందుకు అర్జునుడు “ఓ ధర్మాత్ముడా! నేను ఇప్పుడు బాణాలతో సముద్రంపై సేతువు నిర్మిస్తాను. నీ ప్రయత్నం నీవు చేసి దానిని పడగొట్టు. బలంగా నడిచికాని, శక్తి కొలది వేగంగా పరుగులెత్తికాని, ఏ ఉపాయంచే అయిన ఆ బంధనాన్ని విరగకొట్టు. ఓ సౌమ్యుడా! నిశ్చల బుద్ధితో నేను ప్రతిజ్ఞకూడా చేస్తున్నాను. నేను నిర్మించే శరబంధనం నీచేత భేధింప బడేటట్లయితే వెంటనే నేను నా గాండీవంతోసహా అగ్ని యందు ప్రవేశిస్తున్నాను.” అని ప్రతిజ్ఞ చేసి ఆ కుంతీసుతుడు బాణాలతో సముద్రానికి బంధనం నిర్మించాడు. హనుమంతుడా శరబంధానాన్ని తేరిపార చూచాడు. తన సీతారాములను స్మరించుకొన్నాడు. విజయునితో ఇలా అన్నాడు. “ఓ రాజా! సీతారాముల పాదములను సేవించుటద్వారా పరిపుష్టమైన పరాక్రమం కల నేను నీ శరబంధం నా అడుగులతో విరుగకొట్టగలను. అలా విరగకొట్టలేకపోతే నీ విజయాన్ని అంగీకరించేవాడవై నీరధం యొక్క టెక్కెముపైన చిహ్నంగా ఉంటాను.” అని చిరునవ్వుతో పల్కాడు.

రామనామధ్యాన తత్పరుడయ్యే నెమ్మదిగా ఒక్క అడుగు, రెండడుగులు, మూడడుగులు వేశాడు. అంతే బాణాలవంతెన ఒక్క పెట్టున విరిగి కూలిపోయింది. దానిని చూసిన అర్జునుని ముఖం వెలవెలబోయింది. రాజశ్రేష్టు డా పరిస్థితికి అత్యంతం ఆశ్చర్యపడ్డాడు. వెంటనే గాండీవాన్ని పారవేశాడు. అనేక విధాల తనను, తన గాండీవాన్ని నిందించుకొనటం మొదలుపెట్టాడు. ఇంత కాలంగా సాధిస్తున్న విజయాలన్నింటినీ తుడిచివేసేటంతటి పరాజయంగా ఆ పరిస్థితిని భావించాడు. నిరాశతో చాలా విచారించాడు. తనకంతా అగమ్యగోచరంగా తోచింది. ‘ఇప్పటి నుండి నా శక్తికి నాశనమేర్పడినట్లేనా’? అని ప్రశ్నించుకొన్నాడు. ‘ఇది రాక్షసమాయయా? కాకున్న కలయా? నాకు దిగ్భ్రాంతి కల్గెనా ఏమి? లేక మతి చెడెనా? కాకున్న ఇంతటి విపరీతం వేరొకవిధంగా ఎలా కల్గుతుంది?’ అని మనసులో పరిపరివిధాల వాపోతూ పరిజనానికి అగ్నిని రగుల్కొల్పమని ఆజ్ఞ చేశాడు. తాను చేసిన ప్రతిజ్ఞకు బద్ధుడౌతూ తన గాండీవంతో బాటు అగ్నిలో ప్రవేశించటానికి సిద్ధమయాడు. ఇంతలో ఆ అర్జునుని రక్షించుటయే ప్రధానకార్యంగా తలచే కృష్ణుడు అన్ని పనులు వదులుకొని పాండుతనయుని రక్షించుకొనటం కోసం అక్కడకి వచ్చాడు హనుమంతుని, అర్జునుని చూచాడు. “ఓ ధీరులారా! మీరిక్కడ ఏమిచేస్తున్నారు? ఎందుకోసం ఇక్కడ అగ్ని ఏర్పాటు చేయబడింది? ఈ శరపంజరం ఎందుకు విరిగింది?” అని ప్రశ్నించాడు. పరమాత్ముడైన శ్రీ కృష్ణునకు వారిద్దరూ జరిగినది జరిగినట్లు చెప్పారు.

వారు చెప్పినదంతా విని ఆ జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు. “ఓ నర, వానర శ్రేష్టులారా! సాక్షి లేకుండ మీ రీపని ఎలా చేశారు? నీ చేత శరపంజరం ఎలా ఏర్పాటు చేయబడింది? నీచేత ఆ శరబంధనం ఎలా విరగకొట్టబడింది? మళ్ళీ మీ ఇద్దరూ మీమీ కార్యాలు చక్కబెడితే నేన చూస్తాను. ప్రదర్శించండి.’ అని అన్నాడు. కృష్ణుని మాటలు వింటూనే అర్జునుడు తన మనసున కిష్టమైన ఆ మాటల ననుసరించి వాడియైన బాణాలతో మరల సముద్రానికి బంధనం ఏర్పాటు చేశాడు. హనుమంతుడుకూడా ఆ శరపంజరాన్ని భగ్నంచేయ సిద్ధమైనవాడై దేహాన్ని బాగా సన్నద్ధంచేసి శరపంజరం ఎక్కాడు. పాదములు రెంటినీ శక్తి కొలది మోపినవాడై క్రిందకు నొక్కిపారవేయటంకోసం శరపంజరాన్ని ఊగింపసాగాడు. కాని దృఢమైన ఆధారం ఉండటంవల్ల శరపంజరం చలించలేదు. అప్పుడు ఆ శరమార్గం మీద హనుమంతుడు అటూ ఇటూ తొందరగా, పరుగులెత్తాడు. అయినా ఆ సేతువు చలించలేదు. పవిత్రపరాక్రముడైన ఆ వాయుసుతుడు ఎగిరెగిరి వేగంగా దూకాడు. కాని ఆ బాణాల వంతెన కొంచెం కూడా వికారం చెందలేదు. ముల్లోకములందూ ఎదురులేని తన పరాక్రమానికి ఎన్నడూలేని ఎదురు ఏర్పడిందని హనుమంతుడు తలచాడు. సద్బుద్ధి కలవాడవటంవల్ల అర్జునుని మిక్కిలిగా కొనియాడాడు. ఆ అంజనాసుతుడు తన పరాక్రమాని కేర్పడిన భంగాన్ని, రక్తమయమై ఉన్న జలాన్ని చూసి శరబంధం నుండి దిగాడు. తన భక్తుని విజయుని చూసి ‘పరాజితోహ – నేనోడితిని’ అని పల్కాడు. “ఓ రాజా! పూర్వజన్మలో నీవు విజయుడనే పేరుకల్గిఉండి నా మంత్రం జపించావు. దిక్కులన్నిటిని జయింపవలె ననెడి ఆనాటి కోర్కెను ఈనాడు తీరుస్తున్నాను. నేటినుండి నీకు శత్రువులవలన పరాభవమనునది ఉండదు. నా భక్తులకేర్పడిన పరాభవం నాకు మిక్కిలి భరింపరానిది. అది నదులు, సముద్రాలు, పర్వతాలు, పర్వతాలు అన్నిటితో కూడిన భూమికన్నా మిక్కిలి భారమైనది. నేను చేసిన వరదానం ఈ అర్జున జన్మకే కాబట్టి పరాజయమనే మిషతో నీ ధ్వజ చిహ్నంగా ఉండి నీకు విజయం లభింపజేస్తాను’ అని భక్తవత్సలుడు, శ్రీమంతుడు అయిన హనుమంతుడు పల్కి ముల్లోకాలందూ తన భక్తుడైన విజయునకు కీర్తి కల్గటానికి, తా నొనర్చిన ప్రతిజ్ఞ నెరవేర్చటానికి ఆ అర్జునుని ధ్వజ చిహ్నంగా ఏర్పడ్డాడు. అప్పటినుండి అర్జునుడు లోకంలో ప్రయత్నములన్నిటా విజయం సాధిస్తూ కపిధ్వజుడనే ప్రసిద్ధి పొంది ఉన్నాడు.

అనంతరం ఆ అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ కృష్ణునివైపు చూసి ‘కృష్ణా! తిరుగులేని నా భుజ ప్రరాక్రమం చూచావా? ముల్లోకాలలో నాకు ప్రతి వీరుడు లేనేలేడు. ఎందువలనంటే అజేయుడు, రక్కసి మూకలను చెండినవాడు, శివాంశ సంభూతుడు అయిన హనుమంతుడే నా భుజబలంచే జయింపబడి నాటెక్కపు గుర్తుగా ఉన్నాక ఇక నాకు ఎదురేమిటి? అని గర్వంతో పల్కాడు. ఆ అర్జునుని మనసులో చేరిన గర్వాన్ని అణచ దలచినవాడై కృష్ణుడు వెంటనే ఇలా అన్నాడు ‘ఓ అర్జునా! నీవు ఎప్పుడెప్పుడు ప్రతిజ్ఞలు చేసి విజయంకోసం ప్రాకులాడుతావో అప్పుడల్లా నాకు నీ వల్ల శ్రమ కల్గుతూనేఉంది. బలవంతులతో నీవు పోటీ పడకుండటం కోసం మనం ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవలసిందే. ఓ అర్జునా! ఈ నీ ప్రతిజ్ఞాగర్వం హనుమంతుని పాదముల తాకిడిచే బాధపడే నా దేహాన్ని మరింత బాధపెడుతోంది బావా! చూడు. రక్తంతో వ్యాపించిఉన్న లోపలి చర్మం కల్గినట్టి, మాసి ఉన్న పుండు పై భాగం కల్గి లోనుండి క్రొవ్వును వెడలిస్తూ ఉన్న నా శరీరం చూడు.’ అంటూ తనవీపుచూపి కృష్ణుడు మరల ‘ఓ అర్జునా! నీ ప్రతిజ్ఞవలన భయపడి కూర్మరూపం ధరించిన వాడనై నేను శరపంజరం యొక్క క్రిందిభాగాన ఓర్పుతో ఉన్నాను. అప్పుడు మహాత్ముడయిన వాయునందనుని పాదములతాకిడికి నా సర్వావయవాలూ శిధిలంకాగా రక్తం సముద్రజలాన్ని ఎర్రపరుస్తూ ఉండగా మితిమీరిన కష్టం అనుభవించాను. వజ్రాయుధంవంటి శస్త్రాలే ఎవనిఎదుట దూదితో సమానాలో అటువంటి హనుమంతుని ఎదుట, అందునా రాముని పరహసించినందుకు కోపగించిఉన్న హనుమంతుని ఎదుట నిలబడటానికి ఎవ్వడు సమర్థుడు? కాని నాపాట్లను గమనించటంవలన, పూర్వం నీకు వరమిచ్చి ఉండటంవలన, రాబోవు కార్యభారాల ప్రభావంవలన నీ టెక్కెంమీద నిల్చినాడుకాని హనుమంతునకు పరాజయమేమిటి?’ అని పల్కి అర్జునుని తృప్తికోసం కొంత అతనిని కొనియాడాడు. ‘ఓ అర్జునా! సర్వకామితాలు నెరవేరినవాడైనా హనుమంతుడు భక్తి వలన తృప్తిపడిన వాడై నీ కెల్లప్పుడూ జయాన్ని కోరుతూ నీ ధ్వజమునందున్నాడు.’ అని తన మెల్లని మాటలతో అర్జునుని అజ్ఞానాన్ని తొలగించాడు. అర్జునుడుకూడ హనుమచ్చక్తియుక్తులు గ్రహించినవాడై భక్తితో ఆ పవనసుతునకు నతమస్తకు డవుతూ దిక్కులన్నీ జయించాడు.

శిష్యుడు – ఓహో జండాపై కపిరాజు అన్నదానిలో రహస్యం అదన్నమాట.
గురువు – ఆ! జండాపై కపిరాజు ఉన్న దానిలో రహస్యం అదే.

 

[wp_campaign_1]

[wp_campaign_2]

[wp_campaign_3]