vinayaka chavithiఆథ్యాత్మిక బంధువులారా,

వినాయక చవితి శుభాకాంక్షలు.

‘కలౌ చండీ వినాయకౌ’ కలియుగంలో మానవులు సులభంగా పాపవిముక్తులై తరించడానికి వినాయకుణ్ణి, చండీదేవిని ఉపాసించాలని పెద్దల వాక్కు. ఇందులో రహస్యమేమిటంటే సగుణోపాసనలో ప్రథమోపాస్య దేవత అందుకే “ఆదౌ పూజ్యో గణాధిపః” అన్నారు. యోగాభ్యాసంలో మూలాధార చక్రానికి అధిష్టాన దేవత వినాయకుడు. మూలాధార చక్రశుధ్ధి (భేదనం) జరిగితేనే అనంతరోపాసనాధికారం రాదు. ఇక చివరి ఉపాసన శక్త్యుపాసన, దీనిని “శ్రీవిద్య” అన్నారు పెద్దలు.

శ్రీ విద్యోపాసనమే చండీ ఉపాసన. చండీ దేవతానుగ్రహం కలిగితే మాయావరణం తొలగి శక్తి శక్తిమంతుల అభేద గ్రహణం కలిగి బ్రహ్మవిద్యాప్రాప్తికి దారి సుగమమవుతుంది అనేది హయగ్రీవాదుల సిద్దాంతం.

అనగా వినాయకానుగ్రహం ద్వార సాధకుల సాధనలోని విఘ్నాలు (ఉపాసనలోని ప్రతికూలాంశాలు) తొలగి దేవీ అనుగ్రహంతో మాయాప్రభావం లుప్తమై జ్ఞానవికాసం కలిగి మానవుడు తరిస్తాడు. అందుకే ‘కలౌ చండీ వినాయకౌ’ అన్నారు.

వినాయక చవితి – వరసిద్ధి వినాయకవ్రతం

వినాయక చవితి పిల్లల పండుగ. పిల్లలందరూ ఉత్సాహంగా ఇరవై ఒక్క పత్రాలను సేకరించి పెద్దల సహకారంతో జరుపుకుంటారు. బాల్యంలో ఏర్పడే భావనలే జీవితకాలమంతా నిలిచి ఉంటాయి. అందుకే భక్తికి తొలిమెట్టు వినాయక పూజ నియమబధ్ధంగా ఆచరిస్తాం కనుక ఇది వ్రతం అయింది. ఈ వ్రతానిక వరసిధ్ధి వినాయక వ్రతం అనిపేరు. మానవుడు ఆశాజీవి. మనం కోరిన సిద్ధి కలుగుతుందంటే ఆ పనిచేయడం జరుగుతుంది. అట్టి వరసిద్దిని కలిగిస్తుంది కనుక వరసిద్ది వినాయక వ్రతంగా జరుపుకుంటాము.

విద్యార్థులు విద్యా వరాన్ని కోరి చేస్తారీ వ్రతాన్ని. పుస్తకాలను పెట్టి చేసే సరస్వతీ పూజకూడా ఈవ్రతంలో అంతర్భాగం. ఈ దేవుడికి ఉండ్రాళ్ల పిండివంటే చాలా ఇష్టం. అందుకే ఈ రోజు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి వాయనం ఇస్తారు. ఈయనకు ఇరవై ఒక్క పత్రాలంటే ఇష్టం. వ్రతపూజ చాలా ముఖ్యం. ఈ పత్రాలన్నీ ఓషధీ గుణం కలిగి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఆయుర్దాయం అందరూ కోరుకుంటారు. అయితే ఆరోగ్యంతో కూడిన ఆయుర్దాయాన్ని ప్రసాదించేది వరసిద్ది వినాయక వ్రతం.

ఈ వ్రతం భాద్రపద శుద్ద చవితినాడు చేస్తారు. ఆనాడు పరమేశ్వరుడు గజానన రూపంలో మూషికవాహనం అధిష్టించిన పార్వతీ పుత్రుడికి సకల విఘ్న గణాలకు అధిపతిని చేసినందు వలన అన్ని లోకాలలో అందరూ ఈ స్వామిని ఆరాధిస్తారు. అంతేకాదు వివిధ వృత్తులలో వున్నవారు ఆయా వృత్తులకు సంబంధించిన పరికరాలకు పసుపు కుంకుమలతో అలంకరించి పూజచేసి వినాయక స్వరూపంగా భావించి ఉండ్రాళ్ళు పోయడం సంప్రదాయం. దీని వలన అన్ని వృత్తులలో వున్నవారికి విఘ్నాలు తొలగి వృత్తి లాభం చేకూరుతుంది. ఇందులో ఒక రహస్యం యిమిడి వుంది. పరమాత్మకు ప్రత్యేకంగా ఒకరూపం లేదనీ అన్ని రూపాలు ఆయనవేనన్న భావన ఈ పూజలో కనపడుతుంది. దీని వలన భగవంతుణ్ణి తమకు నచ్చిన రూపాలలో పూజింప వచ్చుననీ సర్వస్వరూపుడు వినాయకుడనీ తేలుతున్నది. కనుక వినాయకుడు సర్వస్వరూపాలలో ఉన్న పరబ్రహ్మయని తెలుస్తున్నది.

సగుణంగా చేస్తే ఇది వినాయక వ్రతం. నిర్గుణంగా భావిస్తే ఇది నిర్గుణోపాసనం. మధ్యలో మంత్రానుష్టానాలు చతురావృత్తి తర్పణాలు కూడా ఉన్నాయి. కర్మగా చేస్తే వినాయకుడు, ఉపాసనగా చేస్తే గణపతి జ్ఞానదృష్టితో పరిశీలిస్తే నిర్గుణ పరబ్రహ్మమూర్తి. అందుకే చిన్నతనం లోనేీ ఈ పద్యం చెప్పి ఆయన యందు భక్తిని చొప్పించారు మనపెద్దలు.

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్|
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్|
కొండొకగుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జనై
యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్|

నీలాపనిందల నివారణ కోసం శమంతకోపాఖ్యానం చెప్పుకొని ఈ శ్లోకం చదువుకుని అక్షతలు శిరస్సున ధరించాలి.