శ్రీపరాశర సంహితా – శ్రీ ఆంజనేయస్వామి చరిత్ర – తృతీయ భాగము
(81 నుండి 120 పటములు – పదునాలుగు-పదునెనిమిది పారిజాతములు)

శ్రీపరాశర సంహితా – తృతీయ భాగము విడుదల అయినది అని తెలియజేయుటకు సంతోషించుచున్నాను.
శ్రీపరాశర సంహితా – ప్రధమ, ద్వితీయ, తృతీయ భాగములు చీరాల హనుమత్పీఠమునందు మరియు హైద్రాబాద్ నందు లభ్యమగును.

ధన్యోహం కృతకృత్యోహమ్

SriParasara Samhita - Part 3

ఏనాటి పరాశరమహర్షి! ఏనాటి పరాశర సంహిత! ఈనాటిదాకా నాదాకా వెలుగుచూడకుండా ఉండటమేమిటి? సుదీర్ఘకాలంగా మహాపండితుల కృషితో వెలువడక అల్పజ్ఞడనయిన నా దాకా ఆగటమేమిటి? కేవలం ఆ హనుమత్స్వామియొక్క కరుణ తప్ప మరేకారణముంటుంది? ఏజన్మలో చేసికొన్న తపమో ఇలా ఫలించిందని నా భావన. పూజ్య గురువులు శ్రీపాలకుర్తి వేంకట సుబ్బావధానులుగారి రూపంలో స్వామి పూర్వ తపస్సును కొనసాగింపచేసి వారి అదేశంతో పరాశరసంహిత కృషికి ప్రేరేపించాడని భావన.

తన సేవను ఒకరకంగా కాదు. అనేక విధాల చేయించుకొని హనుమత్స్వామి నా జన్మ ధన్యమయ్యేటట్లు చేశాడు. వేలఏండ్లుగా తాళపత్రాలలో వ్రాతప్రతులలో మ్రగ్గుచున్న ఉద్గ్రంథం నాకోసం ఆగి ఉంది. ఒకరిద్దరు కొంత వెలువరింప యత్నించారు తప్ప కృతకృత్యులు కాలేకపోయారు. అలా నాద్వారానే శ్రీపరాశరసంహిత పూర్తి గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చుకొన్నాడు.

స్వామి యనుగ్రహం నాయందు ఉండుట వలన ఎన్నో హనుమత్కార్యాలు నిర్వహింపగల్గాను. కాని ఎందరి సహకారమో లభించుట వలన తప్ప కేవలం ఒక్కడుగా దేనినీ సాధింపలేను. ఎందరి పేర్లని సహాయకులుగా వ్రాయగలను? కాన వ్యక్తి వ్యక్తికీ ఎల్లవేళలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంతటి ధన్యత ననుగ్రహించిన హనుమత్స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకొంటున్నాను. గ్రంథముద్రణ సహాయకుల ననుగ్రహింప స్వామిని వేడుకొంటున్నాను.

ఇట్లు
హనుమత్సేవకుడు
అన్నదానం చిదంబరశాస్త్రి