శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీరామ
జయహనుమాన్

సోమవారం 22nd July, 2013 – వ్యాస (గురు) పూజ సందర్భమున…

Veda Vyasa Guru Paurnami

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||

హనుమత్ స్వరూపులయిన మా గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పాదపద్మాలకు శిరసువంచి నమస్కరిస్తూ…

ఈ రోజు వేదవ్యాసుల వారి జన్మదినం. అపరనారాయణనుడైన వేదవ్యాసుల వలననే మన భారతీయ సంస్కృతి పరిపుష్టమయ్యింది.

వేదాలు విభజించి, అష్టాదశ మహాపురాణోపపురాణాలను ఏర్పరిచి, మహాభారతేతిహాసాన్ని రచించి, మహాభాగవతాన్ని ప్రసాదించి, బ్రహ్మసూత్రాలను నిర్మించి కర్మజ్ఞాన భక్తిమార్గాలను పటిష్టం చేసిన ఆ మహాత్ముని ఈ రోజున అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. ఆయనను విస్మరించడం కన్నా కృతఘ్నతాదోషం మరొకటుండదు. వ్యాసుని గ్రంధాల్లో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చెయ్యాలి. వ్యాసపీఠం పై వ్యాసదేవుని ఏ గ్రంధమైనా (పురాణాల్లోనివి గానీ, భాగవతం గానీ) ఉంచి, అందు వ్యాసదేవుని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలి.

వారివారి గురువులను అర్చించాలి. నిజమైన గురుపూజ ఈ రోజే. చదువు చెప్పే గురువుని, మంత్రోపదేశం చేసిన గురువుని యధోచితంగా సత్కరించి అర్చించాలి. గురువులోనే వ్యాసదేవుని భావించి ఆరాధించాలి. వారివారి గురుపరంపరని పూజించాలి.

వ్యాసకృతమైన పురాణాది గ్రంధాల పఠనం ఈ రోజున ఆవశ్యకం. నారాయణ, సదాశివ, బ్రహ్మ, వశిష్ట, శక్తి, పరాశర, వ్యాస, శుక, గౌడపాద, గోవింద భగవత్పాద శంకరాచార్యులను ఆరాధించాలి.

శ్రీకృష్ణుని, వ్యాసుని, జైమిని, సుమంత, వైశంపాయన, పైలాది వ్యాసశిష్యులను, శ్రీ ఆదిశంకర, పద్మపాద, విశ్వరూప, తోటక, హస్తామలకచార్యులను ఆవాహన చేసి పూజించాలి.

ఈ రోజుననే ప్రతివారు తమ గురువును అర్చించాలి. వ్యాసదేవులు జగద్గురువులు. వారి ద్వారా లోకానికి అందిన ధర్మాన్నే గురువు మనకు ఉపదేశిస్తాడు. కనుక జగద్గురువును మన గురువు యందే దర్శించి, ఆరాధించాలి. అందుకు వ్యాసపూర్ణిమను గురుపూర్ణిమగా నిర్ణయించారు సంప్రదాయజ్ఞులు.

నాకు జీవితాన్ని, పరమార్థాన్ని అందించిన మీకు కృతజ్ఞతగా…మనస్సు నిండా అభిమానాన్ని నింపుకొని నా హృదయాన్ని పూలమాలగా చేసి మీ పాదపద్మములయందు సమర్పిస్తున్నాను.

ఆత్మీయంగా స్వీకరించండి.
నిండు మనసుతో ఆశీర్వదించండి.

ఇట్లు
భవదీయ
అడివి రమేష్ చంద్ర
(Adivi Ramesh Chandra)
M: +91.(984)924-5355
E: admin@jayahanumanji.com