Hanumath Vishaya Sarvasvam

ఇది కలికాలము. జీవకోటికి కష్టకాలము. కాలచక్రమాగక వేగముగా పరుగిడుచునే యున్నది. అంతకుమించి మానవుడు వేగముగా పరుగిడుచున్నాడు. అతడు అలస స్వభావి. ప్రతిపనియందు తేలిక మార్గమును చూచుకొనుచున్నాడు. సుఖమును కోరునే తప్ప అందుకు పడవలసిన కష్టముఅ బడడు. హక్కును కాంక్షించునే కాని బాధ్యత నెరుగడు. ఫలితము కాంక్షించునే తప్ప సేవకు సిద్ధము కాడు. సద్యః ఫలితమిచ్చు దానిని తప్ప నమ్మడు. కనబడు దానియందు తప్ప విశ్వాసముంచడు.

ఇట్టి విచిత్ర స్వభావియై కూడా ముముక్షువులగు మహానుభావుల మాటపై విశ్వాసము లేకున్నా స్వార్థ ప్రేరణతో కాని, పాపభీతితో కాని దైవధ్యానమున కుద్యుక్తుడగుచున్నాడు. దైవము భక్తుని పరీక్షించునని పురాణములు చెప్పుచున్నవి. కానీ భక్తుడే దైవాన్ని పరీక్షిస్తున్నాడు. కొన్ని కోర్కెలపై కొంతసేపు దైవాన్ని ధ్యానిస్తాడు. దైవానుగ్రహము కల్గి కోరిక నెరవేరినా ఆ దైవమున్నట్లే, లేదా అతడు లేడని యూరుకొనడు. దైవమును నిందించి, విమర్శించి లోకమునకు చెప్పజూచును. అట్టి మనుజుని కూడా అనుగ్రహించి సమాధానపరచగల భక్తసులభుడు, దయాళువు హనుమంతుడే. హనుమన్మహిను బ్రహ్మ కూడా వర్ణింపజాలడు. ఆంజనేయుని పూజించిన సర్వదేవతలను పూజించినట్లే. హనుమంతుని తన ఇంట ఎవడు ప్రతినిత్యమూ భక్తితో పూజించునో వాని ఇంట సంపదలు నిలుచును. దీర్ఘాయువు చేకూరును. సర్వత్ర విజయము చేకూరును. అతడే సర్వులకూ ఆదర్శమూర్తి. ధర్మాదరణ తక్కువై అధర్మం అనేక రూపాలలో అభివృధ్ది అవుతోంది. ఏ ఒక్క ధార్మిక సంస్థో సమాజంలోని ఈ దోషాల నంతటిని పోగొట్టలేదు. ప్రతి ఇల్లూ ఒక ధార్మిక కేంద్రమై అవకాశమున్న మార్గంలో ధార్మిక ప్రచారం చేయాలి. అందుకు మార్గదర్శి, అసాధ్యసాధకుడు అగు హనుమంతునారాధించి పొందనిది లేదు. భక్తి తత్పరులై ఆ స్వామి అనుగ్రమునకు పాత్రులగుటకు చూపబడిన ఇందలి మార్గములను సద్వినియోగము చేసుకొన గోరుచూ శ్రీ హనుమత్ప్రభువునకు వందన శతములర్పించు కొనుచున్నాను.

మూల్యముః రూ. 25.00

 

విలువైన శ్రీ హనుమద్విషయ సర్వస్వము గ్రంధమును పొందుటకు మీరు మా హనుమత్పీఠమును సంప్రదించగలరు.

ఇట్లు
భక్తవిధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి