దుర్ముఖి, ఉగాదిఅవ్యక్తమయిన ప్రకృతి స్వరూపంతో కాలచక్రం ప్రవేశించడం మాస ఆరంభం పాడ్యమితిథి నుండే. అందుకే సృష్టికర్త “బ్రహ్మ” తనసృష్టిని ఈ పాడ్యమి నుండి ప్రారంభించినందున ఇది యుగారంభమయింది. యుగంను ఆరంభించిన రోజు యుగాది. అదియే ఉగాది. యుగం అనగా జతగా ఉండునది. శిశిర ఋతువులో వృక్షముల ఆకులన్నీ రాలి వికృతమై, వసంత ఋతువులో వృక్షములు చిగురించి, కోకిలగానంతో ప్రకృతి శోభిల్లుతుంది.

ప్రభవ నుండి అక్షయ వరకు అరవై సంవత్సరముల పేర్లన్నీ ఆదిత్యుని విశేషాలే. అరవై సంవత్సరములలో ఆదిత్యునియొక్క ముప్పయ్యవ నామం దుర్ముఖిః.

సూర్యోదయ సమయంలో ఏ గ్రహహోర ఉంటే ఆ గ్రహము ఆ రోజుకు అధిపతి. శుక్రహోరలో సూర్యోదయం జరిగే శుక్రవారంనాడు “దుర్ముఖి” ఆరంభమయింది. కావున ఈ ఏడాది రాజు – శుక్రుడు. భార్యాభర్తల అన్యోన్యతకు కారకుడు శుక్రుడు.

దుర్ముఖి సంవత్సరమునకు రాజైన శుక్రుని అనుగ్రహం పొందాలంటే మహాలక్ష్మీదేవిని, పరమేశ్వరుడిని ప్రతిరోజూ ఆరాధిస్తే అంతాశుభమే కలుగుతుంది.

సర్వశుభములను కలుగజేయునది, శోభాయమానమైనది, కోరికలను ఇచ్చునది, పాపములను హరించునది, దుర్దోషములను పోగొట్టునదియు, అనేక యజ్ఞముల వలన కలుగు ఫలితములను కలుగజేయునది, మనుష్యులకు భూదానములతో సమానమైన ఫలితములను, ఆయురారోగ్యములను, సంతాన సౌఖ్యములను, పవిత్ర కర్మలకు యోగ్యమైన శాస్త్రసమ్మతమైన ఫలితములను కలుగజేయునదైనటువంటి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణముల వంటి వేదాంగములు కలిగిన పంచాంగ శ్రవణము చేయుట సంప్రదాయమైనది.

తిథివల్ల శ్రేయస్సు, వారంవల్ల ఆయుర్వృద్ధి, నక్షత్రంవల్ల పాపహరణము, యోగంద్వారా రోగవిముక్తి, కరణంచేత కార్యసిద్ది కలుగుతాయి.

ఈ యు(ఉ)గాది పండుగ అందరి జీవితాలలో ఆనంద వసంతాలని చిగిరించి, వికసింపజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, దుర్ముఖి నామ సంవత్సర యు(ఉ)గాది శుభాకాంక్షలు.