Ugadi 201431 Mar, 2014 సోమవారం – ఈ రోజు శ్రీ జయ నామ సంవత్సరం, చైత్ర మాస ప్రారంభదినం. ఈ రోజు జరుపుకొనే “ఉగాది” పండుగలో పంచాంగశ్రవణం, ఉగాది పచ్చడి ఆరగించడం ప్రధాన కర్తవ్యాలు.

శ్రీ గురువుగారు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది సందేశం

శ్రీ జయ నామ సంవత్సరము ప్రారంభమవుతున్నదీ రోజే. ప్రతీ భారతీయుడు మరీ చెప్పాలంటే ప్రతీ మానవుడూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొనవలసినది ఈరోజు. ఎందుకంటే యుగాలు విశ్వమంతటికీ సంబంధించినవి. ఇప్పటికి 5115 సంవత్సరాలనాడు ఆరంభమయినదీ కలియుగాబ్ది. అసలు బ్రహ్మసృష్టికే తొలిరోజు ఈ యుగాబ్ది – అదే ఉగాది.

“చైత్ర మాసి జగద్ర్బహ్మా ససర్జప్రథమేహని” అని ఆర్షవాక్యం. చైత్రమాసంలోని తొలిరోజున బ్రహ్మ జగత్తును సృష్టిచేశాడని ఆ వాక్యాని కర్థం. కాబట్టి ఈరోజు కేవలం తెలుగువారికే కాదు విశ్వమంతటికీ పర్వదినం. యుగ + ఆది = ఉగాది అయింది. చైత్రశుద్ధ పాడ్యమి విశ్వమంతటికీ నూతన సంవత్సరాదే అవుతుంది. దురదృష్టవశాత్తు పాశ్చాత్య నాగరికతా వ్యామోహం పెరిగిపోయి జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరాదిగా భారతీయులు కూడా స్వీకరిస్తున్నారు. ఒకప్పుడు ఆ జనవరి 1వ తేదీని పాశ్చాత్యులు కూడా అంగీకరింపలేదు. పాటింపలేదు. అలా అంగీకరింపనివారినే ఆనాటి కొందరు ఏప్రిల్ పూల్స్ అని వెక్కిరించారు. అంటే ఒకప్పుడు ఆదేశాలవారు కూడా ఏప్రిల్ సమీపంలో వచ్చే మన ఉగాదినే సంవత్సరాదిగా గ్రహించేవారు.

భారతభూమి పుణ్యభూమి. కర్మభూమి. భగవంతు డిక్కడే అవతరించాడు. సృష్టికి మూలకందమయిన ఈ ఋషిభూమియందు జన్మించినవారు బ్రహ్మసృజించిన కాలమానాన్ని వీడి ఎవరో బ్రహ్మలు అంటగట్టిన జనవరి 1ని పట్టుకొని వేళ్ళాడటం దురదృష్టకరం.

ఇంగ్లీషు డేట్లక్యాలెండరు వాడుతున్నాము కదా! అంటే మాంసం తిన్నంత మాత్రాన ఎముకలు మెడలో వేసుకు తిరగవలసిన పనిలేదు. ఆంగ్లేయులు మన వ్యవస్థలో బిగించి పారేసిన, వారి నాగరికతని కూకటి వ్రేళ్ళతో పెరికి పారవేయవలసింది పోయి మనప్రభుత్వాలు వారు వేసుకొన్న పునాదులమీదే మన భవనాలు కడుతున్నారు. కాబట్టి ప్రభుత్వపు ఆలోచన నటుంచి హిందూ సంస్కృతి, సభ్యతలయెడ నిజమైన అభిమానం కలవారు పూనుకొని సమాజాన్ని పాశ్చాత్య నాగరికతా ప్రభంజనంలో పూర్తిగా కొట్టుకుపోకుండా కాపాడుకోవాలి. పాశ్చాత్య వ్యామోహం వలని ప్రమాదాల నెత్తిచూపుతూ మన సంస్కృతి, సభ్యతల విలువలను ప్రతివ్యక్తీ చాటిచెప్పాలి.

మన ఇంట్లో ఆడువారు, ఉగాదికి రంగవల్లులలో “నూతన సంవత్సర శుభాకాంక్షలు” నిబంధించేటట్లు చూడాలి. మామిడి తోరణాలు, అలంకరణలు జనవరి 1కి కాక ఉగాదికి ఏర్పాటు చేసేటట్లు చూడాలి. క్రమంగా ఇంటిలో, గ్రామంలో పరిసర గ్రామాల్లో ఈ ప్రయత్నాన్ని తోటివారి సహకారంతో చేస్తే తప్పక ఉత్తమమైన మన సంస్కారాలను కాపాడగల్గుతాము.

ఈ సందర్భంలో మనం మరో ముఖ్య విషయం ఆలోచించాలి. సమీపంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అర్థం చేసికొంటే విమతాలు రాజకీయబలంతో మనధర్మాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకు కారణం హిందువులు రాజకీయం కోసం తమమతాన్ని పూర్తిగా విస్మరించటం, ఇతరమతాలవారు మతం లక్ష్యంగా పెట్టుకొని రాజకీయాలు నెరపటం, దాని పరిణామం హిందూధర్మం సంకట స్థితిలో పడటం కాబట్టి హిందూధర్మాన్ని భక్షించేవారిని ప్రక్కనబెట్టి ధర్మరక్షకులకు రాజకీయ బలాన్ని అందించటంకోసం విచక్షణతో ఓటును వినియోగించుకొనాలి.

అన్నిటికీ అతీతంగా ఉండే మునివరులు కూడా ధర్మసంకట స్థితిలో పడ్డప్పుడు నూతన అవతారంకోసం భగవంతుని ప్రార్థించి ధర్మధ్వంసకులు అంతమయేటట్లు ధర్మబధ్ధమయిన పాలన ఏర్పడేటట్లు చేసి అప్పుడు మరల నిశ్చింతగా తపస్సులో నిమగ్నమయేవారు. మనకెందుకులే అనుకొంటే అధర్మాగ్ని మనల్ని చుట్టుముట్టి భస్మం చేస్తుంది. కాబట్టి అధర్మాన్ని బలహీన పరచి ధర్మాన్ని బలపూర్ణం చేయటం కోసం ఎవరివంతు పని వారు చేయాలి. సమాజాన్ని చైతన్యవంతంచేసి ధర్మరక్షణలో నిల్పాలి. తప్పక అలా జరుగగలదని ఆశిధ్దాం. అందుకు తగిన కృషి చేద్దాం. ధర్మ రక్షణ దిశగా పయనిద్దాం.

ధర్మస్య జయోస్తు! అధర్మస్య నాశోస్తు!! విశ్వస్య కల్యాణమస్తు!!!