సవ్యాఖ్యాన శ్రీహనుమాన్ బాహుక్
(శ్రీమ ద్గోస్వామి తులసీదాస కృతము)
హనుమత్సేవలో తులసీదాసు
హనుమంతుని త్రికరణశుద్ధిగా సేవించువారి జన్మ ధన్యమనుటకొక చక్కని ఉదాహరణ తులసీదాసు జీవతం. పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన వానిని మూలానక్షత్ర జాతకుడు, నష్టజాతకుడని, కుటుంబానికి అరిష్టమని తండ్రి వదిలేశాడు. చేరదీసిన దాదికూడా చిన్నతనంలోనే చనిపోవటంతో అతణ్ణి దగ్గరకు తీయటానికే అందరూ వెరచేవారు. దిక్కులేనివారికి దేవుడే దిక్కన్నట్లు భగవదనుగ్రహంతో పెరిగాడు. వివాహంకూడా అయింది. అనవరత భార్యాలోలుడుగానున్న తులసీదాసు బావమరిది వచ్చి తన సోదరిని పంపమన్నా పంపలేదు. తులసీదాసు యింటలేని క్షణంలో అతని భార్యను పుట్టింటివారు తీసుకొనివెళ్ళారు. ఇంటికి వచ్చి జరిగినది గుర్తించాడు. అలోచనలో పడ్డాడు. జోరున వర్షం కురుస్తోంది. అర్థరాత్రి అవుతోంది. యమునానది బాగా పొంగి ఉన్నది. కామాంధకారంలో మిగిలినవేమి తెలియలేదు. యమునలో దూకి ఆవలి ఒడ్డు చేరి అత్తవారింటికి వెళ్ళాడు. తలుపులు వేసి ఉన్నాయి. దొడ్డిదోవన గోడపై నున్న పామును త్రాడని పట్టుకొని ఎక్కి యింటిలోకి ప్రవేశించి భార్యను లేపాడు. ఆమె ముందు ఆశ్చర్యపడింది. ఆందోళన పడింది ‘ఛి! ఈ పాడు దేహంపై ఉంచిన మనసు రామునిపై నుంచిన కావలిసినదేముంది?’ అంది. అంతే తులసీదాసు మోహాంధం తొలగిపోయింది. “ప్రియురాలా! నీ వాక్యం సత్యం” అని వెళ్ళిపోయాడు. కాశీ చేరి తనకు రామభక్తి ప్రసాదించమని విశ్వనాథుని ప్రార్థించాడు. విశ్వనాథుడు ప్రసన్నుడయాడు. నిత్యం రామాయణ శ్రవణం చేయమన్నాడు.
కాశీలో భైరవనాథుడని ప్రసిద్ధ శివభక్తుడుండేవాడు. శివానుగ్రహంవల్ల గొప్ప శక్తులు పొందినవాడతడు. ఆబాల గోపాలము నతమస్తకులై అతనిని సేవించుకొంటూ ఉండేవారు. హనుమ ద్రామచంద్రుల సేవయే సర్వస్వముగా భావించిన తులసీదాసు ఇతరుల సేవ ఎరుగడు. తనను తులసీదాసు సేవింపకుండటం భైరవనాధునికి కోపం కల్గించింది. తన శక్తి ఏమిటో తులసీదాసుకు తెలియజేయా లనుకొన్నాడు. ఆ కోపంతో తులసీదాసు బాహువులందు మహాపీడ కల్గించాడు. అనేకవిధాల వైద్యచికిత్సలు జరిగాయి కాని ప్రయోజనం శూన్యం. అప్పుడు తనకు రక్షకుడైన హనుమంతుని గూర్చి చేసినదే ఈ “హనుమాన్ బాహుక్” అనే పేరుగల స్తోత్రం. వెంటనే భైరవనాథుని ప్రయోగంవలన ఏర్పడిన బాహుపీడ మటుమాయ మయింది.
తులసీదాసు రచించిన ‘హనుమాన్ చాలీసా’ వలె ఇదికూడా చాలా శక్తి గలది. హనుమన్మందిరమున కేగి పవిత్రచిత్తమున మండలకాలము (నలుబది రోజులు) దీని నెవరు పఠింతురో వారియొక్క సమస్త ప్రేతబాధలు, సర్వవిధముల శారీరక మానసిక పీడలు శ్రీహనుమంతుడు తొలగించును.
కావున ఏవధమైన కష్టములనున్న వారయినా దీనిని పఠించి హనుమదనుగ్రహమునకు పాత్రులై పీడావిమోచనము పొందవచ్చును. హనుమత్సాహిత్య ప్రచారముచేయు మా శ్రీ హనుమదాధ్యాత్మిక కేంద్రం ఆశయము ననుసరించి దీనిని భక్తకోటి కందజేయు గల్గుచున్నందుకు సంతసించుచున్నాము. తులసీదాసకృతమగు నీ స్తోత్రమును సద్వినియయోగ మొనర్చుకొనుటద్వార ఎల్లవారు హనుమత్కృపకు పాత్రులౌదురుగాక!
మూల్యముః Rs12.00
పుస్తకముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ః
శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి, చీరాల – +91-98486 66973
రమేష్ చంద్ర అడివి, హైదరాబాద్ – +91-98492 45355 or Contact me on email here.
Be First to Comment