Press "Enter" to skip to content

తపస్సుతో బ్రహ్మర్షిత్వం సాధించిన విశ్వామిత్రుడు – Part 1

Viswamitra Maharshi

               సప్తర్షులలో ఒకరైన విశ్వామిత్ర మహర్షి జీవితం చాలా విశిష్టమైనది. కోపం, అహంకారము, ఈర్ష్య, అసూయ, అధికార మదం, ధనము, భుజశక్తులతో ఈ బ్రహ్మాండంలో ఏదైనా సాధించవచ్చు అనేవి రాజస, తామస గుణాలు.  శాంతి, అహింస, ప్రేమ, పరోపకారం, సమాజ శ్రేయస్సు అనే సత్వగుణ శక్తుల ముందు పరాజయం చెంది, స్వీయ అనుభవముతో  వినాశకరమైన  తమస్సు వదిలి, జీవితానికి పరమార్థాన్ని ప్రసాదించే తపస్సుతో బ్రహ్మర్షి గా మారిన వ్యక్తే విశ్వామిత్రుడు. పేరును సార్థకం చేసుకున్న ఆయన నిజంగా విశ్వానికి మిత్రుడే. కలియుగంలో మానవాళికి ఈ మహర్షి జీవితం ఒక మార్గదర్శకం అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

            బ్రహ్మ కుమారుడు కుశుడు. ఆయన పుత్రుడు కుశనాభుడు. ఆయనకు నూరుగురు కుమార్తెలు. ఆ నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత కుశనాభుడికి పుత్రసంతానం లేకపోవడం వల్ల పుత్రకామేష్టి యాగం చెయ్యగా, అత్యంత పరాక్రమం కలిగిన పుత్రుడుగా గాధి జన్మిస్తాడు. గాధి కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది.

            గాధి మహారాజుకు ముందుగా సత్యవతి అనే కుమార్తె ఉండేది. ఆమెను ఋచీకుడనే మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. గాధికి పుత్రసంతానం లేక, తన రాజ్యాన్ని అప్పగించడానికి తనయుడు లేడని బాధపడుతుండేవాడు. సత్యవతి కోరిక మేరకు ఋచీక మహర్షి తన భార్యకు, గాధి మహారాజు భార్య ఇరువురకు పుత్ర సంతానం కలిగే విధంగా ఒక క్రతువు చేసి సత్యవతికి విప్ర లక్షణములు, గాధి భార్యకు క్షాత్ర లక్షణములు కల పుత్రులు జనించేటట్లుగా క్రతువు ఫలాలను అందచేశాడు. పొరపాటున సత్యవతి తనకు అందచేసిన ఫలాన్ని తల్లికి ఇచ్చి, తల్లికి ఇచ్చిన ఫలాన్ని తాను ఆరగించింది. జరిగిన పొరపాటును ఋచీకుడు తెలియచేయగా, సత్యవతి దుఃఖిస్తూ తనకు విప్ర సంతానమే కావాలని  అభ్యర్థించగా, పుత్రుడు కాక మనవడు క్షత్రియ లక్షణములు  కలవాడు కాగలడని ఓదార్చాడు. అలా వారికి జన్మించిన పుత్రుడే జమదగ్ని మహర్షి. జమదగ్ని తనయుడే పరశురాముడు,  క్షాత్ర లక్షణములతో జన్మించాడు. 

            గాధి మహారాజు భార్యకు కలిగిన పుత్రుడికి విశ్వామిత్రుడు అని నామకరణము చేశాడు. విశ్వామిత్రుడు బ్రాహ్మణ క్షత్రియ లక్షణములు కలిగి ఉండెడివాడు. అతనికి నిష్ణాతులైన గురువులను నియమించి  ధనుర్విద్యలయందు,  వేదశాస్త్రములయందు ప్రావీణ్యుణుడిగా తయారుచేశాడు. విశ్వామిత్రునకు యుక్తవయుస్సు వచ్చిన తరువాత ఒక రాజకన్యను ఇచ్చి వివాహము చేసి, రాజ్యాభిషిక్తుడిని చేసి, గాధి రాజు రాజ్యభారాన్ని తనయునకు అప్పగించాడు.విశ్వామిత్రునకు నూరుగురు పుత్రులు జన్మించారు. 

విశ్వామిత్ర వశిష్ఠ సంవాదం 

            కొంతకాలము గడిచిన తరువాత విశ్వామిత్రుడు భూమండల పర్యటన  చేయవలెనని తలచి రాజ్య పాలన మంత్రులకు అప్పగించి భార్య, పుత్రులతో, చతురంగ సేనలతో బయలుదేరాడు.  మార్గమధ్యములో ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమునకు చేరాడు. విశ్వామిత్రుని  వశిష్ఠుడు ఆదరముతో ఆశ్రమంలోనికి ఆహ్వానించి, కుశలములు అడిగి, తన క్షేమ విషయములు తెలియచేసి, తన ఆతిధ్యం స్వీకరించవలసిందిగా కోరాడు.  తాను సపరివారంగా, చతురంగ సేనలతో వచ్చానని, ఒంటరివాడిని కానని, అందరికీ ఆతిథ్యం ఇవ్వటం ఆశ్రమంలో ఉండే మహర్షికి చాలా భారమైన విషయమని, ఆశీర్వదించమని ప్రార్థించాడు, వశిష్ఠుడు తనకు ఎలాంటి కష్టమైన విషయం కాదని, ఆతిథ్యం స్వీకరించమనగా, ఏ విధముగా మహర్షికి సామర్థ్యం కలదో చూడవలెనని తలంచి విశ్వామిత్రుడు అంగీకరించాడు. వశిష్ఠుడు తన వద్ద ఉన్నశబల అనే కామధేనువును పిలిచి అతిధులందరికీ వారి వారి ఇచ్ఛానుసారం ఆతిథ్యం ఇవ్వమంటాడు. ఆ విందు స్వీకరించి విశ్వామిత్ర సహితంగా పరివారమంతా అత్యంత సంతృప్తి చెందారు, ఆశ్చర్యానికీ లోను అయ్యారు. 

            విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆతిధ్యమును ఎంతగానో మెచ్చుకొని శబల వంటి కామధేనువు తన వంటి చక్రవర్తుల వద్ద ఉండవలసినదని, తనకు ఇయ్యవలసినదిగా, శబలకు బదులుగా లక్ష గోవులను, ధన కనక వస్తు వాహనాలను ఇచ్చెదనని అనెను. దానికి వశిష్ఠుడు శబల వలననే తమ ఆశ్రమములో జరిగే హోమ క్రతువులకు కావలసిన ద్రవ్యములు, ఆశ్రమవాసుల దేహ పోషణము,  అతిథులకు ఆతిథ్యము లభ్యమవుతున్నాయని, తాపసులకు ధనవస్తువాహనములతో అవసరము లేదని సున్నితముగా విశ్వామిత్రుని అభ్యర్థనను తిరస్కరించాడు. తిరస్కరణకు గురైన విశ్వామిత్రుడు కోపముతో తన భటులను పిలిచి శబలను బంధించి తన రాజ్యమునకు తరలించవలసినదిగా ఆజ్ఞాపించెను. భటులు త్రాళ్లతో గట్టిగా బంధించి తీసుకెళ్లబోగా, ఆ కట్లను త్రెంచుకొని శబల వశిష్ఠుని వద్దకు పరుగెత్తుకొని వచ్చి నన్ను మీరు ఈ రాక్షసులకు ఎందుకు అప్పగించారు అని ఏడువసాగెను. దానికి వశిష్ఠుడు అమ్మా, ఆ రాజు అహంకారంతో, సేనాబలంతో ఉన్నవాడు, నా వద్ద నువ్వు తప్ప ఇంకేమి లేదు, నేను అశక్తుడను అనెను. మహర్షీ, మీ బ్రహ్మబలము ముందు క్షాత్రబలము నిలువదు, నాకు అనుమతిని ఇయ్యగలరు, వారిని అంతము చేసెదను అనగా అలాగే అని వశిష్ఠుడు అనుమతించెను.

            అప్పుడు శబల ఒక హూంకారం (అంబా నాదం) చేసి, వెంటనే శూలాయుధులైన పహ్లవులు అనే యవనులకు జన్మనిచ్చి వారి ద్వారా విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది. అది చూసి క్రోధ పరవశుడైన విశ్వామిత్రుడు అనేక శస్త్రాస్త్రాలతో పహ్లవులను సంహరిస్తాడు. దానికి క్రుద్ధ అయిన శబల తన శరీరం నుంచి కాంభోజ వంశీయులను, పొదుగు నుండి పహ్లవులను, యోని స్థానం నుండి యవనులను, గోమయం వచ్చే స్థానం నుండి శకులను, రోమకూపాలనుండి హరీకులను, కిరాతకులను పుట్టించగా వారు విశ్వామిత్రుని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. అది చూసిన విశ్వామిత్రుడి నూరుగురు కుమారులు వశిష్ఠమహర్షిని చంపేందుకు వెళ్తారు. వశిష్ఠ మహర్షి తీక్ష్ణ దృష్టితో చూడగా నూరుగురు భస్మరాశులై పడిపోతారు.

            విశ్వామిత్రుడు తన నూరుగురు పుత్రులను, సైన్యాన్ని పోగొట్టుకొనినవాడై, నిశ్చేష్టుడై, వశిష్ఠుడిని భుజబలముతో ఎదుర్కొనలేనని తలచి, మిగిలిన పరివారాన్ని రాజ్యానికి పంపివేసి, తను హిమాలయాలకు వెళ్లి అచట శివుని గూర్చి తపస్సు చేయసాగెను. (సశేషం)

– “సుందరశ్రీ” అడివి రమేష్ చంద్ర

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: