గురు ప్రకాశనము
30-5-2009 నాటి డా. అన్నదానం చిదంబర శాస్త్రి గారి షష్టిపూర్తి సందర్భంగా ప్రత్యేక సంచిక
సంపాదకీయం
నేను శ్రీపరాశర సంహితపై (Parasara Samhita) పరిశోధన చేస్తున్నాను. అందులో ఒక ప్రత్యేకాంశం గురువిషయమం. ఆ అంశంపై పరిశీలిస్తున్న సమయంలో పరాశరమహర్షి చెప్పిన ఒక మంచి వాక్యం నాదృష్టికి వచ్చింది. అది నాకు నచ్చింది. అది “గురుం ప్రకాశయే ద్దీమాన్ – మంత్రం యత్నేన గోపయేత్” అనేది. అటువంటి గురుప్రకాశనం చేసికొని ఋషివాక్యాన్ని సార్థకం చేయాలనిపించింది. దేనికయినా సమయం, సందర్భం ఉండాలికదా! మా నాన్నగారి షష్టిపూర్తి సమయంలో ఆ నా లక్ష్యం పూర్తిచేసికొనా లనుకున్నాను. ముందుగా నా అభిప్రాయం మా నాన్నగారితో చెప్పాను. మనమెంతవాళ్లం? అంటూనే గురుప్రకాశనం శిష్యులహక్కు. దానిని కాదనే హక్కు నాకు లేదు. మీయిష్టం అన్నారు.

